అమరావతికిచ్చే సాయం అప్పు కాదట.. ఈ క్లారిటీతో వైసీపీకి షాక్ తగిలిందిగా!

Reddy P Rajasekhar
కేంద్రం అమరావతికి 15 వేల కోట్ల రూపాయలు అప్పుగా మంజూరు చేసిందని చాలామంది భావించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వార్తలు సైతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయ్యాయి. అయితే అమరావతికిచ్చే సాయం అప్పు కాదని పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చేసింది. 15 వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సమకూర్చనుందని సమాచారం అందుతోంది.
 
ఈ 15 వేల కోట్ల రూపాయలలో 13440 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు, ఏడీబీల నుంచి కేంద్ర ఆర్థిక శాఖ రుణంగా తీసుకుని సీ.ఆర్.డీ.ఏకు ఇచ్చిన మొత్తం కావడం గమనార్హం. రెండు బ్యాంకులు చెరో 80 కోట్ల డాలర్ల చొప్పున రుణం ఇవ్వనున్నాయి. 15 వేల కోట్ల రూపాయలలో బ్యాంకులు ఇచ్చే మొత్తం పోగా మిగిలిన మొత్తాన్ని కేంద్రం సమకూర్చనుంది. కేంద్ర ప్రభుత్వమే బ్యాంకులకు రుణాన్ని తిరిగి చెల్లించనుంది.
 
ప్రపంచ బ్యాంకు, ఏడీబీ అమరావతి కేపిటల్ సిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం పేరుతో ఈ రుణాన్ని మంజూరు చేయనున్నాయి. ప్రపంచ బ్యాంక్ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో పత్రాలను ప్రపంచ బ్యాంక్ వెబ్ సైట్ లో ఉంచింది. ప్రపంచ బ్యాంక్ ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖను రుణ గ్రహీతగా పేర్కొనగా సీఆర్డీఏను ప్రాజెక్ట్ అమలు ఏజెన్సీగా పేర్కొనడం గమనార్హం.
 
కేంద్రం ఈ రుణాన్ని ప్రోగ్రామ్ ఫర్ రిజల్ట్స్ ఫైనాన్సింగ్ విధానంలో సమకూర్చనున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రూపంలోనే ఈ మొత్తాన్ని ఇస్తోందని ఈ విధంగా అర్థమవుతోంది. కేంద్రం రుణం తీసుకుని ఎక్కువ మొత్తాన్ని ఇస్తున్న నేపథ్యంలో అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందే ఛాన్స్ అయితే ఉంది. కేంద్రం క్లారిటీతో వైసీపీకి భారీ షాక్ తగిలిందని చెప్పవచ్చు. మోదీ సర్కార్ ఏపీ విషయంలో ఒకింత ప్రేమగానే వ్యవహరిస్తూ ఉండటం కొసమెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: