మంచి టైం చూసి పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన విజయ్? ఇక తిరుగులేదా?
కమలహాసన్ ఓ విఫల ప్రయోగం. విజయ్ కాంత్ కూడా అంతే.. తెలుగు నాట చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు.. తిరుపతిలో సభ పెట్టినప్పుడు లక్షలాదిమంది జనం వచ్చారు. ఇసుక వేస్తే రాలనంత జనం సందడి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 18 సీట్లు మాత్రమే వచ్చాయి. చివరికి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.
తెలుగు, తమిళం మాత్రమే కాదు… కన్నడ, మలయాళం లోనూ సినిమా వాళ్లు రాజకీయాలలో పెద్దగా రాణించింది లేదు. మోహన్ లాల్ కు రాజకీయాలు అంటే పడవు. మమ్ముట్టి చాలా దూరం. సురేష్ గోపి బిజెపిలో ఉన్నప్పటికీ ఆయన ప్రభావం అంతంత మాత్రమే. ఇక విజయ్ పార్టీకి అవకాశాలు లేవని కొట్టి పారేయలేం. అలాగని ఆయన రాజకీయ ప్రయాణం కేక్ వాక్ అని చెప్పలేం. జయలలిత మరణించిన తర్వాత అన్నా డీఎంకే అంపశయ్యపై ఉంది. ఆ పార్టీకి లీడర్లు లేరు. శశికళకు అంత సన్నివేశం లేదు.
ప్రస్తుత నాయకులను తమిళ జనం పెద్దగా యాక్సెప్ట్ చేయడం లేదు. ఈ ప్రకారం విజయ్ కి ఎంత కొత్త స్పేస్ ఉండొచ్చు. అతను నేరుగా డీఎంకే పరిపాలనను విమర్శిస్తున్నాడు. కుటుంబ రాజకీయాలను ఎదురిస్తున్నాడు. అంతేకాదు పెరియార్ ను గౌరవిస్తామని చెబుతూనే నాస్తిక వాదాన్ని అనుసరించబోమని అంటున్నాడు.. అంతేకాదు ఆస్తికత్వం, నాస్తికత్వం ప్రజల విషయానికి వదిలేయాలని.. రాజకీయ పార్టీల ఏజెండాలో దాన్ని చేర్చడం సరికాదని విజయ్ స్పష్టత ఇస్తున్నాడు.
తమిళనాడులో ఎలాగూ కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదు. కమ్యూనిస్టులకు ఎదిగే స్కోప్ లేదు. ఇంకా బిజెపి అంటారా.. దానికి అక్కడ ఎలా ఎదగాలో తెలియదు.. మొత్తంగా చూస్తే విజయ్ మంచి టైం చూసుకునే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..