భద్రాచలం - కొవ్వూరు రైల్వే లైన్ ఎటు... స్టేషన్లు ఎక్కడెక్కడ..?
ఈ రెండిటిలో ఏది సాకారం అయినా జిల్లాలోని మెట్ట ప్రాంతానికి మేలు జరుగుతుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ హైవే వైపు ఈ రైల్వే లైన్ వెళితే ఏలూరు జిల్లాలో ఉన్న చింతలపూడి, టి. నరసాపురం మండలాలకు రైలు ప్రయాణం దగ్గర అవుతుంది. లేదా జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల వైపు నుంచి లైను నిర్మించిన రైలు మార్గం జంగారెడ్డిగూడెం పట్టణానికి దగ్గరగా వెళుతుంది. గతంలో భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి.. ఈ లైన్ కొవ్వూరు వరకు నిర్మించాలని ప్రతిపాదన ఉంది.
ఇప్పుడు కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు, సింగరేణి దక్షిణ మధ్య రైల్వే సంయుక్తంగా లైన్ నిర్మాణం పూర్తి చేశాయి. సత్తుపల్లి నుంచి కొత్తగూడేనికి ఈ లైన్ ద్వారా బొగ్గు రవాణా సాగుతోంది. అలా ఇప్పుడు సత్తుపల్లి నుంచి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలోని చింతలపూడి, టీ నర్సాపురం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల మీదగా కొవ్వూరుకు రైల్వే లైను వేయనున్నారు. అయితే తెలంగాణ ప్రతిపాదనల ప్రకారం సత్తుపల్లి, దమ్మపేట, అశ్వరావుపేట, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల మీద లైన్ వెళ్ళనుంది.
ఇక హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు ప్రస్తుతం ఉన్న విజయవాడ లైన్‌కు మరో మార్గంగా ఆప్షన్ కోసం రైల్వే శాఖ అన్వేషిస్తున్న నేపథ్యంలో గ్రీన్ ఫీల్డ్ హైవేకు అనుసంధానంగా నిర్మాణం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మార్గం ద్వారా హైదరాబాద్ విశాఖ మధ్య 90 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ఈ లైన్ ఎటు నిర్మించినా జిల్లా మీదుగా వెళ్ళటం తప్పనిసరి కావడంతో.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మరో రైల్వే లైన్ ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది.