తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర! సీఎం అవ్వడం పక్కానా..?
కాంగ్రెస్ పాలన రాష్ట్రానికి శాపంగా మారిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే ఉద్దేశం ఎంతమాత్రం లేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అబద్ధాల మీద కాంగ్రెస్ పార్టీ సమయం గడుపుతోందని పేర్కొన్నారు. 420 హామీలతో ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతకంటే గొప్ప పరిపాలన ఆశించే పరిస్థితి లేదని, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ రాజకీయ వేధింపులకూ దిగిందని ఆరోపించారు.
వాటికి భయపడేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా.. ఆస్క్.. కేటీఆర్‌లో భాగంగా ఓ నెటిజన్ ఇంట్రస్టింగ్ ప్రశ్న వేశారు. 'దేశంలోని అనేక పార్టీల నేతలు ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు, పార్టీలను బలోపేతం చేసేందుకు పార్టీల అధ్యక్షులు పాదయాత్రలు చేస్తున్నారు. మీరెప్పుడు చేస్తారు' అని అడిగారు.
దీనికి కేటీఆర్ స్పందించారు. ఖచ్చితంగా తన పాదయాత్ర కూడా ఉంటుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని చెప్పుకొచ్చారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సంభాషణలో కీలక అంశాలను పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పాలన ఫ్రమ్ ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ ఢిల్లీ అన్నట్లుగా తయారైందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేటీఆర్ తాజాగా పాదయాత్ర చేస్తానని ప్రకటించడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అదే సమయంలో ఆనందపడ్డారు. రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి పార్టీలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. చాలా మంది ముఖ్యనేతలు పార్టీని వీడారు.
రాష్ట్రస్థాయి నుంచి జిల్లా, మండల స్థాయి వరకూ కేడర్ నిరుత్సాహంతో ఉంది. కేటీఆర్ తాజా నిర్ణయంతో పార్టీకి మునుపటి రోజులు వస్తాయని కేడర్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కేటీఆర్ కనుక పాదయాత్ర చేస్తే ప్రజల్లో మరోసారి పార్టీకి ఆదరణ లభిస్తుందని అంటున్నారు. భవిష్యత్తులో రాజకీయంగా ఉపయోగపడడమే కాకుండా.. అధికారంలోకి వచ్చేందుకూ దోహదపడుతుందని చెబుతున్నారు.