ఆ రెండు అంశాలతో కూటమికి చుక్కలు చూపిస్తున్న జగన్?

Chakravarthi Kalyan
సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.  రుషికొండ భవనాలను సైతం పరిశీలించారు. గుంతలు లేని రోడ్ల కార్యక్రమానికి సైతం శ్రీకారం చుట్టారు. నక్కపల్లి వద్ద స్టీల్ ప్లాంట్ వస్తుందని కూడా ప్రకటించారు. త్వరలో 52 ఎకరాల్లో విశాఖ రైల్వే జోన్ కు శంకుస్థాపన చేస్తామని కూడా చెప్పుకొచ్చారు.


ఇదే సమయంలో మాజీ మంత్రి బొత్స సరికొత్త డిమాండ్ చంద్రబాబు ముందు ఉంచారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై సమాధానం చెప్పాలని అన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పై ప్రభుత్వ వైఖరి, విధానమేంటో స్పష్టం చేయాలని బొత్స సవాల్ చేశారు.  విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించబోమని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.  అసలు స్టీల్ ప్లాంట్ మూసివేతకు నిర్ణయం తీసుకున్నారా? కేంద్రం చేస్తున్న ప్రైవేటీకరణకు సమర్థిస్తున్నారా? సెయిల్లో విలీనం చేస్తారా? అసలు ఏం చేయబోతున్నారు? వీటన్నింటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు.

 

దీంతో పాటు పోలవరం ఎత్తు పై వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎత్తు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్పుకొస్తోంది. అయినా సరే చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేయకపోవడానికి తప్పు పట్టింది.  దీనిపై స్పందించిన జగన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అది విపరీతంగా వైరల్ అయ్యింది. అయితే దీనిని రాజకీయ ఎత్తుగడగా టిడిపి కొట్టి పారేస్తోంది. జగన్ ట్రాప్ లో పడే పరిస్థితి లేదని తేల్చి చెబుతోంది.

 

మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని రాజకీయం చేయాలని భావిస్తోంది వైసిపి. గతంలో విశాఖ స్టీల్ విషయంలో జగన్ సర్కార్ పై అనేక రకాల విమర్శలు వచ్చాయి. ఇప్పుడు దానిని తిప్పి కొట్టేందుకు జగన్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఏకకాలంలో పోలవరం తో పాటు విశాఖ స్టీల్ విషయంలో టిడిపిని ఇరకాటంలో పెట్టాలని చూస్తోంది వైసిపి.  మొత్తానికైతే 2018 మాదిరిగానే టిడిపి పై వరుస అస్త్రాలను ప్రయోగిస్తోంది వైసిపి. అయితే టిడిపి ట్రాప్ లో పడే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: