ఆ విషయంలో జగన్ మద్దతు లేకుంటే చంద్రబాబు అడుగు కూడా ముందుకు వేయలేడా?
విషయం ఏంటంటే.. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు సహా.. అమరావతి-బెంగళూరు, అమరావతి- హైదరాబాద్, అమరావతి-కలకత్తాలను కలుపుతూ.. భారీ ఎత్తున రహదారులను నిర్మించాలని చంద్రబాబు నిర్ణయించారు. అంతేకాదు, అమరావతి టు అనంతపురం వరకు ఆరు లైన్లతో కూడిన రహదారిని కూడా నిర్మించాలన్నది సీఎం చంద్రబాబు కల. దీనికి అప్పట్లోనే బీజం పడింది. అయితే.. ప్రభుత్వం దిగిపోయి.. వైసీపీ వచ్చింది. తర్వాత అమరావతి పక్కకు జరిగిపోయింది.
చంద్రబాబు రాకతో.. పనులు పుంజుకున్నాయి. రాజధానికి నిధులు ఇస్తామని చెప్పిన కేంద్రం రహదారుల విషయాన్ని మాత్రం రాష్ట్రానికి వదిలేసింది. ఇవి జాతీయ రహదారుల ను కలిపే ప్రాజెక్టులు కావడంతో నిధులు కేంద్రం నుంచి రాబట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇక, ఇప్పుడు ఈ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రహదారుల నిర్మాణ వ్యవహారం వైసీపీ నేతల కోర్టుకు చేరింది.
జాతీయ రహదారుల నిర్మాణం, ఏర్పాటు, ప్లానింగ్, అలైన్మెంట్ వంటి కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేస్ కన్సల్టిం గ్ కమిటీని నియమించింది. కొత్తగా ఎక్కడైనా జాతీయ రహదారి వేయాలంటే ఈ కమిటీ చేసే సిఫారసులపైనే కేంద్రం ఆధారపడుతుంది. ఈ కమిటీలో ఏపీ నుంచి వైసీపీ ఎంపీలకు అవకాశం లభించింది. టీడీపీలో 16 మంది ఎంపీలు ఉన్నా.. వారికి వేరే చోట అవకాశం ఇచ్చారే తప్ప. హైవేల్లో రాలేదు.
వైసీపీ నుంచి ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, అవినాష్రెడ్డిలకు చాన్స్ దక్కింది. వీరు ఏపీకి సంబంధించిన ప్రాజెక్టులే కాకుండా..దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను నిశితంగా పరిశీలించి.. సిఫారసులు చేయనున్నారు. ఒకరకంగా అమరావతి రహదారి ప్రాజెక్టులు ముందుకు వెళ్లాలా? వద్దా? అనేది వీరి నిర్ణయంపైనే వీరి సిఫారసులపైనే ఆధారపడి ఉంటుంది. ఇది ఒకరకంగా చంద్రబాబు కలల ప్రాజెక్టులు ముందుకు సాగేందుకు.. కీలకంగా మారింది.