ఏపీ: పవన్ సంచలన కామెంట్ పై హోంమంత్రి రియాక్షన్.?

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్‌లో శాంతి, భద్రతలు ఏమాత్రం బాగోలేదంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లైంగిక దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. నేరస్థులకు కులం, మతం అనే భేదాలు ఉండవని చెప్పారు. ఏపీలో ఇటీవల జరుగుతున్న ఘటనలకు హోంమంత్రి అనిత బాధ్యత వహించాలని అన్నారు. మంత్రి స్థానంలో ఉన్నవారు బాధ్యతాయుతంగా మెలగాలని, చలనం లేకుండా ఉంటే క్రిమినల్స్ రెచ్చిపోతారని పవన్ చెప్పుకొచ్చారు. పరిస్థితి ఇలానే ఉంటే తానే హోంమంత్రి బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుందని అన్నారు.ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచార ఘటనలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి తప్పూ లేదని ఆమె అన్నారు.పవన్ ఏ కేసు విషయంలో ఆగ్రహంతో మాట్లాడారో తెలుసని, త్వరలోనే దాని గురించి ఆయనతో మాట్లాడతానని అనిత చెప్పుకొచ్చారు. ఏం సందర్భంలో మాట్లాడారో కూడా తెలుసుకోకుండా సంబరపడుతున్నారంటూ హోం మంత్రి అనిత ఎద్దేవా చేశారు. అనిత విఫలమయిందని పవన్‌ కల్యాణ్‌ అన్నట్లు చూపించాలని ఆమె ఓపెన్‌ చాలెంజ్‌ చేశారు. అనంతపురం జిల్లా కేంద్రంలో పోలీస్‌ అధికారులతో సమీక్ష అనంతరం సోమవారం రాత్రి మంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. 'పవన్‌ కల్యాణ్‌ బాధతో అన్న మాటలను వక్రీకరిస్తున్నారు. 

సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిని, కట్టు తప్పి ప్రవర్తిస్తున్న వారినీ అదుపులోకి తీసుకోవడంపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. అయినా అక్కడక్కడా పోలీసులు ఉదాసీనతతో వ్యవహరిస్తున్నారు. అది చూసి కడుపు మండి ఎవరైనా మాట్లాడతారు. రాజకీయం ముసుగులో నేరస్థులు చేసిన పనులకు పర్యవసానం నేడు చూస్తున్నాం. నేను చేస్తున్న పనికి ఆయన మద్దతిచ్చినట్లయింది. మరింత తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మరింతగా సమీక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. డిప్యూటీ సీఎంగా ఆయన చెప్పిన దానిని పరిగణలోకి తీసుకుంటాను. సోషల్‌ మీడియాకు నేనూ బాధితురాలినే. పవన్‌ కల్యాణ్‌ బయటపడ్డారు. నేను బయటపడలేదు అంతే. రాబందుల్లా మీద పడుతున్నారు. ఆ పెట్టే పోస్టులు నా పోలీస్‌ ఆఫీసర్లకే పంపించాలి. సిగ్గుతో పంపించలేక దిగమింగుకుంటున్నా' అంటూ గద్గద స్వరంతో అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛా పేరుతో భయంకరమైన దాడి చేస్తున్నారంటూ... 'ఎవడో మా ఇళ్లల్లోని ఆడపిల్లల మీదకు వస్తామని పోస్టులు పెడుతుంటే చేతలు కట్టుకొని కూర్చోవాలా? సోషల్‌ మీడియాలో మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. ఆడవాళ్లు రాజకీయాల్లో రావాలంటే దిగజారాలా? మా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టాలా' అని మంత్రి అనిత అన్నారు. ఏదైనా సంఘటన జరిగినపుడు కిందిస్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకోవడమే కాదు... ఉన్నతాధికారుల పనితీరుపైనా సమీక్షిస్తామని హోం మంత్రి స్పష్టం చేశారు. శ్రీసత్యసాయి జిల్లాలో గ్యాంగ్‌ రేప్‌ బాధాకరమని, గతంలోనే ఇలాంటి వారిపై చర్యలు తీసుకొని ఉంటే ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేవని అనిత అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: