ట్రంప్ నిర్ణయం పై ఆధారపడిన రష్యా, ఇజ్రాయెల్! యుద్ధాలను ముగిస్తారా?
పుతిన్ కు డొనాల్డ్ ట్రంప్ స్నేహితుడు అనే సంగతి తెలిసిందే. 2016 అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని.. ట్రంప్ గెలుపునకు ఇది దోహదపడిందనే ఆరోపణలున్నాయి. 2020లోనూ ట్రంప్ గెలిస్తే ఎలా ఉండేదో కానీ.. ఓటమి పాలుకావడం చాలా ప్రభావమే చూపిందని చెప్పాలి. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్యను బైడెన్ నిలువరించలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. ఉక్రెయిన్ ను నాటోలో చేర్చుకోవడంపైనే రష్యా యుద్ధానికి దిగింది. తాను అధికారంలోకి వస్తే రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి 24 గంటల్లో ముగింపు పలుకుతానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో గట్టిగా చెప్పారు. తాను గెలిచి వైట్ హౌస్ లోకి వెళ్లేలాగోనే గాజాలో యుద్ధానికి ముగింపు పలకాలని ఇజ్రాయెల్ కు ట్రంప్ స్పష్టం చేశారు.
తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికే దిగేది కాదని అంటుంటారు ట్రంప్. మరి ఇప్పుడు ఏం చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బహ్రెయిన్-ఇజ్రాయెల్-యూఏఈ మధ్య సంధి కుదిర్చిన ఘనత ట్రంప్ ది. 2020లో ఈ దేశాలను ఏకతాటిపైకి తెచ్చి ఒప్పందాలు కుదిర్చారు. అందుకే ట్రంప్ పై ఆశలు రేకెత్తుతున్నాయి.
పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ కు చేస్తున్న సాయంపై పుతిన్ గుర్రుగా ఉన్నారు. రక్షణ రంగంపై నిధులు ఖర్చుపెట్టాలని నాటో దేశాలను ట్రంప్ ఒత్తిడి చేస్తుంటారు. జీడీపీలో 2 శాతం రక్షణ బడ్జెట్లను పెంచుకోని దేశాలపైకి రష్యాను ఉసిగొల్పుతానని గతంలో స్వయంగా ట్రంప్ హెచ్చరించారు. నాటోలోని 31 దేశాల్లో 7 మాత్రమే ఇలా చేస్తున్నాయి., నాటోలో ఉక్రెయిన్ చేర్చుకునే ప్రక్రియపై కాస్త వెనక్కుతగ్గినా పుతిన్ ను సముదాయించి యుద్ధాన్ని ఆపొచ్చు. ట్రంప్ ఆ పని చేస్తారేమో చూడాలి.