బాల్య వివాహాలు ప్రోత్సహించేలా కొత్త చట్టం.. అక్కడ తొమ్మిదేళ్ల బాలికలనే పెళ్లి చేసుకోవచ్చు..!!
ఈ చట్టం పాసైతే ఇరాక్‌లో మహిళలకు ఉన్న హక్కులు తీవ్రంగా దెబ్బతింటాయి. ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి. తాలిబాన్ కాలంలో మహిళలపై విధించిన ఆంక్షలను ఈ చట్టం గుర్తు చేస్తుంది. ఈ కొత్త చట్టాన్ని తీసుకురావాలనే చేస్తున్న ప్రయత్నాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ చట్టం పాసైతే చిన్న అమ్మాయిలను బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని, కుటుంబ విషయాలపై మత నాయకులకు అధికారం ఇవ్వడం లాంటిది అని ఇరాకీ ప్రతినిధి రాయ ఫైక్ హెచ్చరించారు. ఈ చట్టం పాసైతే బాలికల అత్యాచారాలకు చట్టబద్ధత లభిస్తుందని ఆమె ‘ది గార్డియన్’కు తెలిపారు.
ఇరాక్‌లో చాలా కాలంగా మతపరమైన కులాల మధ్య సంఘర్షణలు జరుగుతున్నాయి. దీని వల్ల షియా ముస్లిం మతస్థులు ఆధిపత్యం చెలాయిస్తున్న ప్రభుత్వం అధికారంలో ఉంది. వ్యక్తిగత చట్టాల్లో మార్పులు చేయాలనే ప్రయత్నం ఇది మొదటిసారి కాదు. కానీ ఇరాకీ మహిళలు చేసిన తీవ్ర నిరసనల కారణంగా గతంలో రెండుసార్లు ఈ ప్రయత్నాలు విఫలమయ్యాయి అని ‘న్యూయార్క్ పోస్ట్’ పేర్కొంది.
పార్లమెంటులో మతపరమైన సంస్థల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండటం వల్ల ఈ చట్టం ఆమోదం పొందే అవకాశం ఎక్కువగా ఉంది. రాయ ఫైక్ అనే మహిళా ప్రతినిధితో సహా ఇంకో 25 మంది మహిళా ప్రతినిధులు ఈ చట్టాన్ని ఆపడానికి కష్టపడుతున్నారు. 1959లో తీసుకువచ్చిన ‘188వ చట్టం’ ఒకప్పుడు పశ్చిమ ఆసియాలో ప్రోగ్రెసివ్ ఫ్యామిలీ చట్టాలలో ఒకటిగా పరిగణించబడింది. ఈ చట్టం అన్ని మతాల వారికి ఒకే విధమైన నియమాలను అందించింది. కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఈ చట్టాన్ని సవరించడం ద్వారా ఇస్లామిక్ షరియా చట్టాన్ని కచ్చితంగా అనుసరిస్తున్నామని, చిన్న అమ్మాయిలను రక్షిస్తున్నామని వాదిస్తోంది. మహిళా సంఘాల నుండి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ, ప్రభుత్వం తమ పార్లమెంటులోని మెజారిటీ బలంతో ఈ చట్టాన్ని ఆమోదించాలని ప్రయత్నిస్తోంది.