అమరావతి నిధులు.. కొన్ని సంగతులు.. !
అయితే.. ఈ నిధుల ఖర్చు వ్యవహారంపై కూటమి పార్టీల్లోని నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవు తున్నాయి. ప్రధానంగా ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకుంటున్న రూ.15000 కోట్ల ను ఖర్చు చేసే విషయంలో కొన్ని సూచనలు, సలహాలు వస్తున్నాయి. కానీ, చంద్రబాబు వీటిని పక్కన పెడుతున్నారు. ఈ నిధులను ప్రధాన పనులకు వినియోగించాలన్నది కూటమి పార్టీల అభిప్రాయంగా ఉంది. దీనివల్ల ఐకానిక్ టవర్లు.. ఇతర ప్రాజెక్టులను పూర్తి చేస్తే.. బాగుంటుందని చెబుతున్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు సాయంత్రం పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్యంగా గుంటూరుకు చెందిన వారు చంద్రబాబును కలిశారు. వీరంతా అమరావతి ప్రాజెక్టుకు సంబంధించి గళం విప్పారు. ప్రధాన పనులు పూర్తయితే.. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు తర్వాత నిధులు సమకూర్చుకోవడం తేలిక అవుతుందన్నది వారి ఉద్దేశం. కానీ, చంద్రబాబు తీసుకుంటున్న రూ.15 వేల కోట్లను ప్రస్తుతం ట్రంకు రోడ్లు, సుందరీకరణ, చెట్ల పెంపకం, నీటి వనరుల ఏర్పాటు కు వినియోగించాలని నిర్ణయించారు.
ఇదే విషయాన్ని ప్రపంచ బ్యాంకుకు కూడా చెప్పారు. ఈ ప్రాతిపదికనే నిధులను కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే.. ఇలా చేసి, ప్రధాన ఐకానిక్ వంతెనలు, భవనాలను నిర్మించకపోతే.. అమరావతికి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపరన్నది టీడీపీ, జనసేన నాయకులు చెబుతున్న మాట. అయితే.. మౌలిక సదుపాయాల కల్పన జరిగితే.. పెట్టుబడులకు ఇబ్బంది లేదన్నది చంద్రబాబు భావన. దీంతో ఆయన ఖర్చుల విషయంలో మీరు ఆందోళన చెందొద్దంటూ.. సున్నితంగా తిరస్కరించారు.