అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా జరిగాయి. అధికార-విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. సభలో ప్రవేశపెట్టిన బిల్లులన్నీ పాస్ అయ్యాయి. కానీ అసెంబ్లీ ఒక్కసారి కూడా వాయిదా పడలేదు. వాయిదాల పర్వం లేని అసెంబ్లీ సమావేశాలను మీరు చూస్తే ఫిదా అవుతారు.ఇది అసెంబ్లీ సమావేశమే కానీ మాక్ అసెంబ్లీ చిల్డ్రన్ డే సందర్భంగా హైదరాబాద్ NCERTలో అండర్ 18 మాక్ అసెంబ్లీ జరిగింది. ఈ సమావేశాల్లో విద్యార్థులు దుమ్ములేపారు. నేటి విద్యార్థులే రేపటి ప్రజాప్రతినిధులన్నట్టు డైలాగులు దంచికొట్టారు. అధికారంలో ఉన్నవాళ్లు దర్పం చూపెట్టడానికి యత్నిస్తే.. విపక్షంలో ఉన్నవాళ్లు డైలాగులతో రివర్స్ ఎటాక్ చేశారు.ఇదిలావుండగా వీళ్లంతా విద్యార్థులే కానీ స్పీచ్‌లో బేస్ ఉంది. పంచ్‌లో పవర్ ఉంది. ప్రసంగంలో పస ఉంది. పిల్లల సభ కాస్త సరదాగా కాస్త సీరియస్‌గా సాగింది. మాస్, క్లాస్ డైలాగ్స్ కలిపికొట్టారు విద్యార్థులు. స్పీకర్ చైర్‌లో కూర్చున్న విద్యార్థి కూడా ఎంతో హుందాగా మాట్లాడారు.ఈ మాక్ అసెంబ్లీకి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సభ జరిగిన తీరు చూసి మురిసి పోయారు. విద్యార్థుల అసెంబ్లీ సమావేశాలు చూసి తాను ఫిదా అయ్యానన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలు కూడా వాయిదా లేకుండా సాగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా విద్యార్థుల మాక్ అసెంబ్లీని వీక్షించి, వారిని అభినందించారు.
విద్యార్థులు చాలా చక్కగా, హుందాగా.. ప్రభుత్వ, ప్రతిపక్షపాత్రలు పోషించారని ప్రశంసించారు. శాసన సభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు, సమాధానాలు ఇతర అంశాలను విద్యార్థులు గమనించాలన్నారు . విపక్షాలు ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని నిలదీయడం వారి బాధ్యత అని లీడర్ ఆఫ్ ది హౌస్, లీడర్ ఆఫ్ ది అపొజిషన్ ఇద్దరికీ సమాన అవకాశాలు ఉంటాయని తెలిపారు. సభను సమర్ధవంతంగా నడిపే బాధ్యత స్పీకర్ పై ఉంటుందనివిపక్షాలు ఆందోళన చేసినా ప్రభుత్వం సమన్వయంతో సభను నడిపించేలా చూడాలి.కానీ దురదృష్టవశాత్తు ఈరోజుల్లో కొందరు సభను ఎలా వాయిదా వేయాలా అనే విధంగా చేస్తున్నారని పేర్కొన్నారు.దేశంలో ప్రతి పేదవాడు చదువుకునేందుకు విద్యా విప్లవాన్ని తెచ్చింది జవహర్ లాల్ నెహ్ర అని గుర్తు చేశారు. నెహ్రూ స్పూర్తితోనే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాహక్కు చట్టం తెచ్చిందని అన్నారు. రాజీవ్ గాంధీ వల్లే 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కు వచ్చిందన్న సీఎం రేవంత్ రెడ్డి.. అసెంబ్లీకి పోటీ చేసే వయసును 25 నుంచి 21 ఏళ్ళకు తగ్గిస్తే రాజకీయాల్లోకి యువత వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో యువతరం ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.