అచ్చెన్న ఇలాకాలో వైసీపీలో డిష్యుం... డిష్యుం... !
శ్రీకాకుళం జిల్లాలో అత్యంత ముఖ్యమైన నియోజకవర్గం టెక్కలి. ఇక్కడ విజయం దక్కించుకోవాలన్నది వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కల. ఈ కలను సహకారం చేసే నాయకుడు కనిపించడం లేదు. నాయకులను మార్చినా ప్రజల మనసులను మాత్రం వైసిపి గెలవలేక పోతుంది. గత ఎన్నికలలో టెక్కలిలో సమన్వయకర్తగా ఉన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసును తొలగించి ఆయన స్థానంలో పేరాడ తిలక్‌ను కొత్త సమన్వయకర్తగా నియమించారు. దువ్వాడ శ్రీనివాస్ డబుల్ ఫ్యామిలీ వ్యవహారం రచ్చకు ఎక్కడంతో ఆయనను తప్పించేశారు. ఇప్పుడు కూడా నియోజకవర్గంలో సమన్వయం కనిపించడం లేదు. టెక్కలి వైసిపి నాయకులు రెండుగా చీలిపోయారు.
వైసిపి అధిష్టానం ఆదేశాలను తప్పకుండా పాటిస్తానని చెప్పుకునే దువ్వాడ తెరచాటన అంతర్గత రాజకీయాలతో వేడెక్కిస్తున్నారు. తనకున్న ఎమ్మెల్సీ పదవి అడ్డుపెట్టుకుని ఇన్చార్జి పేరాడ తిలక్ కు అస్సలు సహకరించడం లేదు. ప్రతి విషయం తనకు చెప్పాలని నాయకులను ఆదేశిస్తున్నారు. వాస్తవానికి టెక్కలిలో మంత్రి అచ్చం నాయుడు లాంటి బలమైన నేత టిడిపికి ఉన్నారు. అలాంటి చోట వైసీపీ పాగా వేయటం అంటే ఎంతో కష్టపడాలి .. కాని వైసీపీలో గ్రూపుల గోల ఎక్కువైంది. 2014లో ఇక్కడ పోటీచేసి ఓడిపోయిన దువ్వాడ ను పక్కన పెట్టిన జగన్ 2019లో ఓడిపోయిన పేరాడ తిలక్ కు సీటు ఇచ్చారు. ఆయన కూడా ఓడిపోయారు.
2024 ఎన్నికలలో తిలక్ ను తప్పించి తిరిగి దువ్వాడ శ్రీనుకు సీటు ఇవ్వగా ఆయన కూడా ఓడిపోయారు. వచ్చే ఎన్నికలు ఎప్పుడు జరిగినా తానే మళ్లీ పోటీ చేస్తానని దువ్వాడ చెబుతూ ఉండటం పేరాడ వర్గంలో ఆగ్రహం రగిలిస్తోంది. ప్రస్తుతం ఇన్చార్జిగా ఉన్న తనకు వచ్చే ఎన్నికలు నాటికి సీటు వస్తుందన్న నమ్మకం లేకపోవడంతో ఆయన కూడా అంత యాక్టివ్ గా ఉండటం లేదు. ఏది ఏమైనా నియోజకవర్గంలో వైసిపి రెండుగా చీలిపోయి కుమ్ములాటలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.