జ‌గ‌న్‌కు జ‌య మంగ‌ళం పాడేశారుగా... !

RAMAKRISHNA S.S.
- ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ ) . .
వైసీపీకి మరో ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. ఎన్నికలలో వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో ఆ పార్టీకి చెందిన ప‌లువురు వరుస పెట్టి రాజీనామాలు చేస్తున్నారు. చివరకు రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ - బీద మస్తాన్ రావు లాంటి నేతలు కూడా తమ పదవులను వదులుకున్నారు. చివరకు తెలంగాణకు చెందిన బీసీ ఉద్యమనేత ఆర్‌. కృష్ణయ్య కూడా తన ఎంపీ పదవిని వదులుకొని వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. తాజాగా ఈ రాజీనామాల పరంపరలో ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ తన పదవికి రాజీనామా చేసి పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. తన రాజీనామాలు మండలి చైర్మన్ మోషేన్ రాజుకు పంపారు. ఎన్నికల ముందు ఆయన వైసీపీలో చేరారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన జ‌య‌ మంగళ వెంకటరమణకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందవచ్చు అని జగన్ అంచనా వేశారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన జ‌య‌ మంగళ వెంకటరమణ 2009లో కైకలూరు నుంచి టిడిపి తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. టిడిపి తో ఆయనకు సుదీర్ఘ అనుబంధం ఉంది. అయితే ఎమ్మెల్సీ పద‌వి ఆశ చూప‌డంతో వెంకటరమణ వైసీపీ వైపు మొగ్గు చూపారు. ఆయన గత ఆరు నెలలుగా మౌనంగా ఉంటూ వస్తున్నారు. వెంకట రమణ పార్టీని వీడుతున్నారని ప్రచారం కొంతకాలంగా ఉంది. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. బహుశా వెంకట్ రమణ తన మాతృ పార్టీ అయిన‌ తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. జ‌య‌ మంగళ వెంకటరమణకు చంద్రబాబు 2014లో సీటు ఇవ్వలేదు. అప్పుడు పొత్తులో భాగంగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌కు బీజేపీ నుంచి సీటు ఇచ్చారు.

2019లో వెంకటరమణకు సీటు ఇవ్వగా ఆయన ఓడిపోయారు. అనంతరం వైసీపీలోకి వెళ్లి ఎమ్మెల్సీ అయ్యారు. ఇక మొన్న‌ ఎన్నికలకు ముందు జగన్ కూడా వెంకటరమణకు సీటు ఇవ్వలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దూలం నాగేశ్వరరావుకు ఇచ్చారు. ఇక వెంకటరమణ అటు ఇటు తిరిగి ఇప్పుడు తిరిగి టిడిపికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వెంకటరమణ తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. అయితే మరికొందరు వైసీపీ ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామాలు చేసిన సంగతి తెలిసింది. అయితే వాటిని మండలి చైర్మన్ ఆమోదించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు జయ మంగళ వెంకటరమణ రాజీనామాను మండలి చైర్మన్ ఆమోదిస్తారా లేదా కాలయాపన చేస్తారా ? అన్నది తేడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: