నాలో ఆ ప్రాబ్లం ఉంది.. ? జగన్ సంచలనం, సరి చేసుకుంటారా మరి.?

Chakravarthi Kalyan

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆత్మ పరిశీలన దిశగా అడుగులు వేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.  విజయం అందరిది.  అపజయం ఒంటరిది. అనాథగా ఉంటుంది. వైసీపీ చరిత్రలో కనీ వినీ ఎరుగని విజయం సాధించిన నాడు అది తమ ఘనతే అని అంతా చెప్పుకున్నారు. కానీ ఓటమిని మాత్రం ఎవరూ భుజాన వేయలేకపోతున్నారు. ఆఖరుకు జగన్ కూడా ఈ ఘోర పరాజయాన్ని నెత్తిన పెట్టుకోలేకపోతున్నారు.  



తనలోని అతి మంచి తనం అతి నిజాయతీ ఈ రెండూ పెద్ద ప్రాబ్లంస్ అని జగన్ చెబుతున్నారు. వాటి వల్లనే తాను 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యానని ఆయన చెబుతున్నారు. అంటే ఇది ఓటమిని అంగీకరించడమే.  అతి మంచితనం అతి నిజాయతీ అన్నవి పాజిటివ్ విషయాలే. అలా తన పాజిటివిటీని చెప్పుకుంటూ జగన్ ఓటమి చెందామని అంటున్నారు. కానీ అత్యధికమైన కారణాలు ఇంకా ఉన్నాయని అంటున్నారు.


అవేంటి అంటే క్యాడర్ ని పక్కన పెట్టడం, పార్టీని పూర్తిగా గాలికి వదిలేయడం. కొందరినే నమ్ముకుని తాడేపల్లిలో నాలుగు గోడల మధ్యన ఉండిపోవడం, ఎదుటి పక్షం వ్యూహాలను సరిగ్గా అంచనా వేయలేకపోవడం, తమ మీద అతి ధీమా, ఎదుటి పక్షం మీద పూర్తిగా తేలిక భావం, పార్టీలో అంతా తానే అన్న భావన. తనను చూసే జనాలు ఓటు చేస్తారు అన్న ఆలోచనలు ఇలా ఎన్నో పార్టీ పరంగా ఉన్నాయి.


ప్రభుత్వ పరంగా చూస్తే కేవలం సంక్షేమాన్ని నమ్ముకోవడం అభివృద్ధిని అయిదేళ్ల విలువలైన కాలంలో ఇదీ అని చూపించలేకపోవడం, అప్పులు ఎక్కువ చేశారా తక్కువ చేశారా అన్నది పక్కన పెడితే సంపద మాత్రం సృష్టించలేకపోయారు అన్న విమర్శలు ఎదుర్కోవడం ఇలా చెప్పుకుంటే రామకోటి మాదిరిగానే ఉన్నాయి.


అయితే జగన్ బయటకు అంగీకరించకపోయినా చెప్పకపోయినా కూడా ఆచరణలో చూపిస్తున్న విషయం అయితే ఒకటి ఉంది. అదే క్యాడర్ తో మమేకం కావాలని నిర్ణయించడం. సంక్రాంతి తరువాత తాను జనంలోకి వస్తాను అని ప్రతీ బుధ,గురు వారాలు రెండు రోజుల పాటు జిల్లాలలోనే బస చేస్తాను అని ప్రతి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గంలోని పార్టీ క్యాడర్ ని పిలిచి వారి నుంచి గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ తెలుసుకుంటానని చెప్పడం. నిజానికి ఇదే వైసీపీకి కావాల్సింది.  దీనిని సరిచూసుకునే పనిలో వైసీపీ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: