మరోసారి సజ్జలకి కీలక బాధ్యతలు అప్పజెప్పిన జగన్? క్యాడర్ ఏం అంటుంది అంటే..?
రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్ఆర్సీపీ ఉద్యమాల బాట పట్టింది. రాష్ట్రవ్యాప్తంగా రైతుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. అనంతపురం జిల్లా దీనికి వేదిక. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా ఆ జిల్లా పార్టీ నాయకులు ఆవిష్కరించారు. రైతులకు మోసపూరిత హామీలను ఇచ్చి చంద్రబాబు గద్దెనెక్కారంటూ మండిపడుతున్నారు.
ఈ ఆందోళన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్రస్థాయి కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులతో మాట్లాడారు. వారికి దిశా నిర్దేశం చేశారు. 13న నిర్వహించదలిచిన ఆందోళనపై చర్చించారు.
ఈ సందర్బంగా సజ్జల మాట్లాడారు. చంద్రబాబు- పవన్ కల్యాణ్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని విస్మరించిందని, ధాన్యం సేకరణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇలాంటి సమయంలో రైతులకు అండగా నిలవాల్సిన అవసరం తమపై ఉందని అన్నారు. ప్రభుత్వంపై అన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం జరిగేలా పోరాటం చేయాలని సజ్జల సూచించారు. ఈ నెల 13వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలను నిర్వహించాలని, వినతిపత్రాలను సమర్పించాలని అన్నారు. పార్టీ శ్రేణులందరూ ఇందులో భాగస్వామ్యం కావాలని కోరారు.
ధాన్యం కొనుగోలు చేసేవారు లేక, గిట్టుబాటుధర అందక రైతులు అల్లాడుతున్నారని, అన్నదాతలు ఈ దుస్థితికి చేరడానికి కారణం చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీలేనని అన్నారు. రాష్ట్రంలో రైతు సమస్యలను నిర్లక్ష్యంగా చూస్తున్న ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా ఈ ఉద్యమం సాగాలని జగన్ సూచించారని చెప్పారు.
అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి సంయుక్తంగా ర్యాలీలను నిర్వహించాలని, కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అధికారులకు వినతిపత్రాలను అందజేయాలని సజ్జల చెప్పారు. గ్రామం నుంచి జిల్లాస్థాయి వరకు మొత్తం పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు ఈ ఉద్యమంలో పాల్గొనాలని అన్నారు.
శాంతియుతంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ఉద్దేశపూరకంగా అనుమతులు నిరాకరించినా, కేసులు పెట్టినా న్యాయపరంగా ఎదుర్కొంటామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, రైతాంగానికి అండగా నిలుస్తూ వారి గొంతుకగా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని కోరారు.