జమిలీ ఎన్నికలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 2027 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని మొన్నటి నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన బిల్లును కేంద్ర కేబినెట్ కూడా ఆమోదించడం జరిగింది. అయితే ఇలాంటి నేపథ్యంలో.. పెద్ద ట్విస్ట్ ఇచ్చారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
అయితే.. తాజాగా మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్ చాట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జమిలీ ఎన్నికలపై హాట్ కామెంట్స్ చేశారు బాబు. జమిలీ అమల్లోకి వచ్చినా, 2029లోనే ఎన్నికలు జరిగేదని తెలిపారు. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించామని గుర్తు చేశారు బాబు. జమిలీ ఎన్నికలపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవటానికి ఏదిపడితే అది మాట్లాడుతోందని నిప్పులు చెరిగారు.
వైసీపీ నేతల మాటలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయాయని చురకలు అంటించారు. వాళ్లు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని.... స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు బాబు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఒకరోజు పెట్టి వదిలేసే కార్యక్రమం కాదని చెప్పుకొచ్చారు చంద్రబాబు.
భవిష్యత్తు తరాల బాగు కోసం చేసే ఈ ప్రయత్నంలో అందరి భాగస్వామ్యం కావాలని.... రేపటి తరం భవిష్యత్తు కోసమే ఈ విజన్ 2047 అని పేర్కొన్నారు. సాగునీటి సంఘాలు, సహకార, ఇతరత్రా ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని ప్రకటించారు. ఈసారి పెట్టే కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఎన్నో మార్పులు తీసుకొస్తామన్నారు. సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా ప్రశ్నలు- సమాధానాల రూపంలో దీనిని నిర్వహిస్తామని పేర్కొన్నారు. ముందుగానే కలెక్టర్లు, ఎస్పీలకు చర్చించాల్సిన అంశాలపై అజెండా పంపి వాటిపై సమాధానాలు కోరతామన్నారు బాబు.