జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. ఈ మేరకు పార్లమెంట్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పెట్టేందుకు కేంద్రం సిద్దమైంది. గతంలోనే జమిలి ఎన్నికలకు సంబంధించి కోవింద్ కమిటీ సిఫార్సులకు కేబినెట్ ఆమోద్రముద్ర వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.జమిలి దిశగా కేంద్రం తీవ్రంగా కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం జమిలికే మొగ్గు చూపుతుండడంతో దీనికోసం ఉన్న అడ్డంకులన్నీ తొలగించుకునేందుకు రెడీ అవుతోంది. పార్లమెంట్ నుంచి పంచాయితీ ఎన్నికలు అన్నీ ఒకేసారి నిర్వహించేందుకు సమాయత్తం చేస్తోంది. మొత్తం రెండు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు అవిపూర్తైన వందరోజుల్లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. దీనికోసం దేశవ్యాప్తంగా ఒకే ఓటరు జాబితాను ఉపయోగించబోతున్నారు.జమిలి ఎన్నికలు అంటే వన్‌నేషన్, వన్ ఎలక్షన్. దేశానికి ఒక్కసారే ఎన్నికలు మిగిలిన ఐదేళ్లూ పరిపాలనపై దృష్టిపెట్టాలన్న దృక్పధంతో జమిలిని తెరపైకి తీసుకొచ్చారు.ఈ నేపథ్యంలో భారత దేశంలో తరచుగా ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికలు జరుగుతుంటాయని దీనివల్ల అనేక సమస్యలు కలుగుతాయని ప్రభుత్వం వాదిస్తుంది.ప్రధానంగా ఎన్నికలను అనేకసార్లు నిర్వహించడం వల్ల ప్రభుత్వానికి,రాజకీయ పార్టీలకు, సిబ్బంది, భద్రతా ప్రచారాల కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చవుతుంది.ఇక ఎన్నికల సమయంలో అమల్లోకి వచ్చే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రభుత్వ కార్యక్రమాలు సంక్షేమ పథకాల అమలును నిలిపివేస్తుంది.అంతే కాదు తరచుగా జరిగే ఎన్నికలు వ్యాపారాలు పెట్టుబడులు ఆర్థిక అభివృద్ధికి అంతరాయం కలిగిస్తాయి. మరోవైపు పదేపదే ఎన్నికలు జరగడం వల్ల ప్రజలు ఓటింగ్ పట్ల ఆసక్తి కోల్పోవడంతో ఓటింగ్ శాతం తగ్గుతుంది. ఈ క్రమంలోనే ఏకకాల ఎన్నికలు పూర్తి చేయడం వల్ల డబ్బు ఆదా అవుతుందని పరిపాలన భద్రతాపరమైన సవాళ్లు తగ్గుతాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రావు మెగ్వాల్ వివరించారు. ఈ విధానం అమలు చేస్తే ఎక్కువమందిని ఓటు వేసేలా చేయవచ్చని ప్రభుత్వం విశ్వసిస్తుంది.