జమిలి ఎన్నికలు ఇప్పట్లో రావా... అప్పుడేనా?

praveen
గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలు గురించే వివిధ వార్తలు రావడం మనం చూస్తూ ఉన్నాము. అవును, జమిలి ఎన్నికల బిల్లు తాజాగా పార్లమెంట్‌ ముందుకు రావడం, విపక్షాలు వ్యతిరేకించడం జరిగిపోయాయి. అయితే జమిలి ఎన్నికలు తప్పేటట్టు కనబడడంలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అవి ఎప్పటినుండి అనేది ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇక 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ మంగళవారం లోక్‌సభలో ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ క్రమంలోనే ఎన్డీఏ మిత్ర పక్షాలు బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించగా, కాంగ్రెస్‌ సహా విపక్షాలు అన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి.
అయితే, ఈ తాజా బిల్లు ప్రకారం, దేశంలో జమిలి ఎన్నికలు 2034 నుంచి జరిగే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అవును... 129వ రాజ్యాంగ సవరణ బిల్లు చట్టరూపం దాల్చాక జరిగే సాధారణ ఎన్నికల తరువాత ఏర్పడే లోక్‌సభ తొలి సిటింగ్‌ డేకు రాష్ట్రపతి నోటిఫికేషన్‌ జారీ చేయడం జరుగుతుంది. అపాయింటెడ్‌ డేగా పిలిచే ఆ రోజు తర్వాత ఏర్పడిన అన్ని అసెంబ్లీలు కూడా లోక్‌సభ కాలపరిమితితోపాటే ఎండ్ అవుతాయి. ఆ తర్వాత నుంచి లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికలన్నీ కూడా ఒకేసారి ఏకకాలంలో జరగబోతాయి. లోక్‌సభగానీ, అసెంబ్లీగానీ పూర్తికాలం ముగియక ముందే రద్దయితే వాటికి 5 ఏళ్ల కాలంలో మిగిలిన సమయానికే ఎన్నికలు జరుగుతాయని బిల్లు పేర్కొంది.
అందువల్ల జమిలి విధానం అనేది దాదాపుగా 2029 సార్వత్రిక ఎన్నికల తర్వాతే ఆచరణలోకి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక దీనివల్ల అయితే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. ఎందుకంటే, 2004 నుంచి కూడా వాటి ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలతోపాటే జరుగుతున్నందున 2029, 2034లోనూ అదే విధానం కొనసాగుతుంది కాబట్టి. 2029లో ఏర్పడే 19వ లోక్‌సభ కాలపరిమితి 2034 మేలో ముగుస్తాయి కాబట్టి 2033లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు, 2034 లోక్‌సభ ఎన్నికలకు మధ్య ఏర్పడే 6 నెలల వ్యవధికి రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుందని కూడా నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: