తిరుపతిలో తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. తప్పు జరిగిందని రాష్ట్ర ప్రభుత్వంగా తాము బాధ్యత తీసుకుంటున్నట్టుగా చెప్పారు.రాష్ట్ర ప్రజలను, వెంకటేశ్వరస్వామి భక్తులను, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను, హైందవ ధర్మాన్ని ప్రతి ఒక్కరిని రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు అడుగుతుందని తెలిపారు. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పవన్ కల్యాణ్ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు జరిగిన పరిణామాలను వివరించారు. అనంతరం పద్మావతి ఆస్పత్రికి వెళ్లిన పవన్ కల్యాణ్.. తోపులాట ఘటనలో అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించారు. ఇదిలావుంటే తన అభిమానులపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల తొక్కిసలాట ఘటనలో బాధితులను పరామర్శించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తిరుపతి వెళ్లిన సంగతి తెలిసిందే.కాగా బాధితులను పరామర్శించేందుకు పవన్ స్విమ్స్, రుయా ఆసుపత్రికి వెళ్ళగా.. పవన్ వస్తున్న విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు భారీ సంఖ్యలో ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకున్నారు.ఆ సమయం లో పవన్‌కళ్యాణ్ ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అరుపులు, కేకలతో గందరగోళం సృష్టించారు.దీంతో పవన్‌కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇది ఆనందించే సమయమా? ఏడ్చే సమయమా? మీకెవరికి బాధ అనిపించట్లేదా? ఇంతమంది పోలీసులు వున్నారు, వాళ్ళను కంట్రోల్ చేయలేరా? అని ఫైర్ అయ్యారు.
ఇదేక్రమంలో తప్పు జరిగింది. బాధ్యత తీసుకుంటాం. క్షతగాత్రులు, రాష్ట్ర ప్రజలు, వేంకటేశ్వరస్వామి భక్తులు, హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరినీ క్షమించమని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతోంది. ఈ ఘటన జరగకుండా ఉండాల్సింది. క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగా జరగలేదని భక్తులు చెబుతున్నారు. తితిదే సిబ్బంది, పోలీసులు ఉండి కూడా ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. వీఐపీలపై కాదు. సామాన్యులపైనా తితిదే దృష్టిపెట్టాలి. మృతుల కుటుంబాల వద్దకు తితిదే సభ్యులు వెళ్లి క్షమాపణలు చెప్పాలి.తొక్కిసలాట ఘటనకు తితిదే ఈవో, ఏఈవో బాధ్యత తీసుకోవాలి. ఘటనా స్థలిలో ఉన్న పోలీసులు బాధ్యత తీసుకోవాలి. అధికారులు చేసిన తప్పులకు మేం తిట్లు తింటున్నాం. తొక్కిసలాట జరిగితే సహాయక చర్యలు ఎలా ఉండాలనే ప్రణాళిక లేదు. వ్యక్తులు చేసిన తప్పులు రాష్ట్ర ప్రభుత్వంపై పడుతున్నాయి. భవిష్యత్తులో దుర్ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. పోలీసుల్లో కొందరు కావాలని చేశారా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ అనుమానాలన్నింటిపై విచారణ జరగాల్సి ఉంది. ఈవో, అదనపు ఈవో, పాలకమండలికి మధ్య గ్యాప్ ఉందనే వాదన ఉంది. ఇంతమంది పోలీసు అధికారులున్నా తప్పు ఎందుకు జరిగింది? పోలీసుశాఖ నిర్లక్ష్యంపై సీఎం, డీజీపీ దృష్టికి మళ్లీ తీసుకెళ్తా. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం 8-9 గంటలు ఎదురు చూసే పరిస్థితి మారాలి. సాధ్యమైతే ఒకట్రెండు గంటల్లో దర్శనం జరిగేలా చూడాలి అని పవన్ కల్యాణ్ అన్నారు.