
భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. చైనా, పాక్‌లకు గుండెల్లో రైళ్లు?
ఫ్రాన్స్ నుంచి మనం అత్యాధునిక రఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్న వేళ, రష్యా తన అమ్ములపొదిలోని రెండు అత్యంత పదునైన అస్త్రాలను భారత్‌కు అందించడానికి ముందుకొచ్చింది. అమెరికా ఎఫ్-35 విమానాల గురించి మనం ఆలోచించని తరుణంలో, వాటికి దీటైన సమాధానంగా రష్యా ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది.
సుఖోయ్ Su-57 (ఫెలాన్): ఇది మామూలు ఫైటర్ జెట్ కాదు. ఐదో తరం స్టెల్త్ టెక్నాలజీతో, శత్రువుల రాడార్ కళ్లకు చిక్కకుండా గాల్లో మాయమయ్యే ఒక దెయ్యం. ఆకాశంలో ఆధిపత్యం చెలాయించడంలో దీనికిదే సాటి. చైనా వద్ద ఉన్న జె-20కి ఇది సరైన పోటీదారు.
సుఖోయ్ Su-35: గగనతలంలో తిరుగులేని రారాజుగా పేరొందిన ఇది, ఒకేసారి గగనతలంలోనూ, భూమిపైనా ఉన్న లక్ష్యాలను ఛేదించగల మల్టీ-రోల్ సుపీరియారిటీ ఫైటర్. దీని విన్యాసాలకు, పోరాట పటిమకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది.
ఈ ఆఫర్‌లో అసలైన కిక్ ఏంటంటే, రష్యా కేవలం విమానాలను అమ్మి చేతులు దులుపుకోవాలని చూడటం లేదు. ఈ రెండు రకాల విమానాలను పూర్తిగా "మేక్ ఇన్ ఇండియా" కార్యక్రమంలో భాగంగా భారత్‌లోనే తయారు చేసేందుకు రష్యా సంసిద్ధత వ్యక్తం చేసింది. సాంకేతికత బదిలీ (ToT) అసలు సిసలైన బ్రహ్మాస్త్రం. ఈ విమానాలకు సంబంధించిన పూర్తి టెక్నాలజీని భారత్‌కు అప్పగించడానికి రష్యా ఒప్పుకుంది. అంటే, భవిష్యత్తులో మనమే సొంతంగా ఇలాంటి విమానాలను అభివృద్ధి చేసుకునేందుకు మార్గం సుగమం అవుతుంది.
సర్వీసింగ్ కూడా మన చేతుల్లోకే: విమానాల సర్వీసింగ్, నిర్వహణ బాధ్యతలను కూడా భారతీయ సంస్థలకే అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది మన రక్షణ రంగ పరిశ్రమలకు అతిపెద్ద బూస్ట్. ప్రస్తుతం మన వాయుసేన వద్ద ఉన్న 220 సుఖోయ్ Su-30 MKI విమానాల అసెంబ్లింగ్, నిర్వహణలో కొన్ని సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో రష్యా ఈ మెగా ప్రపోజల్‌తో ముందుకు రావడం గమనార్హం. 114 మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ (MRFA) టెండర్ కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతుండగా, రష్యా ఈ డీల్‌తో అందరికంటే ఒక అడుగు ముందుకేసింది. సుఖోయ్-35 విమానాలను నేరుగా ఈ టెండర్‌లో భాగంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పింది.
ఈ డీల్ ఓకే అయితే భారత వాయుసేన బలం అమాంతం పెరిగిపోతుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు, మన వాయుసేన ఆధునికీకరణ జరగడమే కాకుండా, "ఆత్మనిర్భర్ భారత్" కల కూడా సాకారమవుతుంది. ఇప్పుడు బంతి పూర్తిగా భారత ప్రభుత్వం కోర్టులో ఉంది. ఈ చారిత్రక ఆఫర్‌పై ఢిల్లీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.