సుజ‌నా చౌద‌రికి ఆ ల‌క్ ఉందా... కాలం క‌లిసొచ్చేనా... !

RAMAKRISHNA S.S.
- ( విజ‌య‌వాడ‌ - ఇండియా హెరాల్డ్ )

సుజనా చౌదరి ప్రముఖ పారిశ్రామిక వేత్త, రాజకీయ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి. ప్రస్తుతం ఆయన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే తాజాగా టీడీపీ వర్గాల్లో సాగుతున్న చర్చల ప్రకారం, ఆయనకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాక‌పోయినా ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు, చర్చలు చూస్తే ఈ విషయం నిజమేనని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.2019 ఎన్నికల అనంతరం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సమయంలో బీజేపీలోకి అడుగుపెట్టిన సుజనా, అక్కడ పెద్దగా యాక్టివ్‌గా లేరు. అస‌లు సుజ‌నాకు రాజ‌కీయంగా లైఫ్ వ‌చ్చింది టీడీపీలోనే.. ! 2014లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడానికి చేసిన పాదయాత్రల్లో సుజనా చౌదరి కీలక పాత్ర పోషించారు. అనంతరం ఆయనను రాజ్యసభకు పంపారు. దీంతో చంద్రబాబు, సుజనా మధ్య ఉన్న రాజకీయ–వ్యాపార అనుబంధం ఇప్పటికీ కొనసాగుతోందన్న మాట రాజకీయం వర్గాల్లో వినిపిస్తోంది.


ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం పెట్టుబడులపై భారీగా దృష్టి పెట్టుతోంది. రాష్ట్రానికి బహుళ జాతీ సంస్థల పెట్టుబడులు రాబట్టేందుకు, పారిశ్రామిక వేత్తలకు నమ్మకం కల్పించేలా ప్రభుత్వాన్ని తీర్చిదిద్దే యత్నం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక రంగంలో మంచి అనుభవం ఉన్న సుజనా చౌదరి వంటి నేతను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా పెట్టుబడిదారుల మద్దతు పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. బీజేపీ నుంచి ప్రస్తుతం ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నా, కూటమి పరంగా బీజేపీకి రెండో మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. గతంలో మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాసరావులు మంత్రులుగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కూడా బీజేపీ కోటాలో మరో పదవిని ఇవ్వాలన్న అభిప్రాయం బలపడుతోంది.


ఈ క్రమంలో బీజేపీ కోటాలో సుజనాకు అవకాశం కల్పించి, రాజకీయంగా సానుకూల సంకేతాలు ఇవ్వడంతో పాటు పారిశ్రామికంగా ప్రయోజనాలను పొందాలన్నదే చంద్రబాబు వ్యూహంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఈ వ్యవహారం పూర్తిగా చంద్రబాబు, బీజేపీ కేంద్ర నాయకత్వం మధ్య ఏర్పడే చర్చలపై ఆధారపడి ఉంటుంది. సుజనాకు మంత్రిగా అవకాశం వస్తే అది కేవలం ఒక నాయకునికి అవకాశం కల్పించడం మాత్రమే కాకుండా, పెట్టుబడుల రీత్యా రాష్ట్రానికి కొత్త గేటు తెరచే అవకాశంగా మారుతుంది. మ‌రి ఫైన‌ల్‌గా సుజనాకు ఈసారి లక్కు కలిసివచ్చి మంత్రివర్గంలో స్థానం దక్కుతుందా? లేక రాజకీయ సమీకరణాలు వేరే దిశలో మలుపు తిరుగుతాయా? అన్నది చూడాల్సిన విషయం.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: