తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్‌రెడ్డికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. గత ఎన్నికలకు ముందే డాలర్స్ దివాకర్ టీడీపీలో చేరారు. వైసీపీ కంచుకోట అయిన చంద్రగిరిలో ఆయన టీడీపీ గెలుపులో తన వంతుగా కష్టపడ్డారు. అందుకే పులివర్తి నానికి భారీ మెజార్టీ వచ్చింది. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరిలో ఆయన పోటీ కోసం చాపకింద నీరులా బలపడుతూ వస్తున్నారు. మరోవైపు చంద్రగిరి రెండు నియోజకవర్గాలుగా చీలిపోతుందని.. తిరుపతి రూరల్ నుంచి దివాకర్ పోటీ చేస్తారని కూడా అంటున్నారు. దీనిపై సుధారెడ్డి బహిరంగంగానే మాట్లాడారు. స్త్రీ శక్తి పథకం కార్యక్రమంలో వేదిక మీద దివాకర్ వేదిక మీద ఉండగానే సుధారెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల నాటికి చంద్రగిరి నియోజకవర్గం రెండుగా చీలిపోతుందని ప్రచారం జరుగుతోందని... ఈ ప్రచారం ఇప్పుడు మనకు అనవసరం అని.. లేనిపోని కన్‌ఫ్యూజ్‌కు కొందరు గురి చేస్తున్నారని.. ఇవన్నీ పక్కన పెట్టి మనం కలిసి కట్టుగా ఉంటేనే మరోసారి విజయం సాధిస్తామని చెప్పారు.
దివాకర్ వేదిక మీద ఉండగానే సుధాకర్ రెడ్డి ఈ కామెంట్స్ చేయడం వెనక ఆమె పరోక్షంగా దివాకర్ రెడ్డికే స్వీట్ వార్నింగ్ ఇచ్చారన్న గుసగుసలు నడుస్తున్నాయి. అందుకే ప్రతిసారి పార్టీ యువనేత లోకేష్ పిడికిలి బిగించి మరీ ఐక్యత చాటి చెపుతారని కూడా ఆమె గుర్తు చేశారు. పైగా 33 శాతం రిజర్వేషన్లు అమలు అయితే తాను కూడా మహిళా కోటాలో ఎమ్మెల్యే అవుతానని మరీ స్పష్టం చేశారు. ఏదేమైనా పులివర్తి ఫ్యామిలీ చంద్రగిరిలో డాలర్స్ దివాకర్ బలపడేందుకు ఎంత మాత్రం ఇష్టపడడం లేదని తేటతెల్లమైంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు