టీడీపీ పేటియం టీంపై రామచంద్ర యాదవ్ ఫైర్... ఒక్కొక్కరి జాతకాలు బయటపెడతా..!
విమర్శలు మానుకోకపోతే ఒక్కొక్కరి జాతకాలు బయటపెడతా
తనపై నిరాధార ఆరోపణలు చేస్తే ఒక్కొక్కరి జాతకాలు బయటపెడుతానని రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పేటిఎం ఏజెంట్లు లాగ గాల్లో మాట్లాడను అని, సాక్ష్యాలతోనే మాట్లాడుతానని సవాల్ విసిరారు. ఎన్టీ రామారావుకి పెట్టే విగ్రహాలకు తాము వ్యతిరేకం కాదన్నారు. కానీ భగవంతుడికి అపచారం జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమన్నారు. ఎన్టీఆర్ ను రాజకీయంగా వాడుకొని, పూజలు చేసే నాయకులు... అవసరం లేనప్పుడు చెప్పులతో కొట్టిన చరిత్ర కూడా గుర్తు పెట్టుకోవాలన్నారు. తాను సిద్దాంత పరంగా మాత్రమే విమర్శలు చేస్తానని వ్యక్తిగత విమర్శలు ఎప్పుడూ చేయలేదన్నారు. తనపై విమర్శలు చేసే ఆ ఉన్మాదులు ప్రజా సమస్యలపై ఫోకస్ పెడితే ప్రజలకు మంచి జరుగుతుందని హితవు పలికారు.
రెండో బాబాయ్ గురించి మాట్లాడితే తల కూడా ఎత్తుకోలేరు
రాష్ట్రంలో అందరికీ ఒక్క బాబాయ్ గురించి మాత్రమే తెలుసునని, తాను ఇంకో బాబాయ్ గురించి మాట్లాడితే తలలు ఎక్కడ పెట్టుకుంటారని రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే హెరిటేజ్ పై కూడా సాక్ష్యాలతో మాట్లాడాల్సి వస్తుందన్నారు. తనకు ఒక్కొక్కరి చరిత్రా తెలుసునని, అనవసరంగా వ్యక్తిగత విమర్శలు చేసి తమ జాతకాలు బయటపడేలా చేసుకోవద్దని హెచ్చరించారు. తాను ఏదీ గాల్లో మాట్లాడనన్నారు. తాను మాట్లాడే ప్రతి మాటను ఆధారాలతోనే మాట్లాడుతానన్నారు.
గాల్లో విమర్శలు చేస్తే చూస్తూ ఉండటానికి నేను జగన్ మోహన్ రెడ్డిని కాదు
కొందరు ఉన్మాదులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుంటే చూస్తూ ఉండటానికి తాను జగన్ మోహన్ రెడ్డిని కాదని రామచంద్రయాదవ్ ఫైర్ అయ్యారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తే పరిస్థితి వేరేలా ఉంటుందన్నారు. నిజంగా దమ్ముంటే జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు. దోచుకున్న అవినీతి సొమ్మును కక్కించాలన్నారు. అవన్నీ వదిలేసి రామచంద్ర యాదవ్ పేరు చెబితేనే ఉలిక్కి పడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా
తనపై చేస్తున్న ఆరోపణల్లో ఒక్కటైనా నిజమని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని రామచంద్రయాదవ్ సవాల్ విసిరారు. తాను ఎవరికో బినామీ అని, తన వెనుక ఏదో పార్టీ ఉందని, ఎవరో నాయకుడు తనను నడిపిస్తున్నానడి చిల్లర విమర్శలు చేసే వారికి ఘాటుగా బుద్ది చెబుతానన్నారు. పసలేని, నిరాధార ఆరోపణలు చేసి విలువలు పోగొట్టుకోవద్దని హెచ్చరించారు. జాతికి జరుగుతున్న అవమానాలను చూస్తూ కూడా చిల్లర కాసులకు కక్కుర్తి పడి పార్టీల మోచేతి నీళ్లు తాగుతున్న కొందరు బిసి సంఘాల నాయకులు ఇకనైనా బుద్ది తెచ్చుకోవాలని హితవు పలికారు.
శ్రీక్రిష్ణుడిపై వక్రబాష్యం చెబితే తాట తీస్తాం
శ్రీక్రిష్ణుడిపై కొంత మంది పేటిఎం ఉన్మాదులు అభ్యంతరకర వ్యాఖ్యలు, పోస్టులు పెడుతున్నారని అలాంటి వారిని ఉపేక్షించేంది లేదని రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్వాపరయుగం గురించి, శ్రీక్రిష్ణుడి రూపం గురించి మాట్లాడితే తాట తీస్తామన్నారు. కొందరు ఎన్టీరామారావు వల్లే శ్రీక్రిష్ణుడి ప్రతిష్ట పెరిగిందని చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మం గురించి, దేవుళ్ల గురించి పిచ్చి కూతలు కూస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
బీహార్ లో పోటీపై క్లారిటీ..
బీహార్ రాజధాని పాట్నాలో ఇటీవల తాను పర్యటించానని, కానీ దాన్ని కూడా రాజకీయం చేసి కొందరు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మాజీ ఐఎఎస్ అధికారి ఆహ్వానం మేరకు తాను పాట్నాకు వెళ్లానన్నారు. అక్కడ ఉన్న కొందరు అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించామన్నారు. అయితే తాను అక్కడ పోటీ చేయబోతున్నానని ప్రచారం చేస్తున్నారన్నారు. తాను ఆ రోజే మాట్లాడనని, బీహార్ అభివ్రుద్దిలో ఒక రాజకీయ పార్టీగా బిసివై పార్టీ అండగా ఉంటుందని ప్రకటించానన్నారు. ఎన్నికల తరువాత బీహార్ లో అభివ్రుద్ది చేసేందుకు ఉన్న అవకాశాలపై ఒక రాజకీయ పార్టీగా స్పందిస్తానని అక్కడి వారికి మాట ఇచ్చానన్నారు. కానీ కొందరు తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అక్కడ ఉన్న యాదవ నాయకులకు వ్యతిరేకంగా నేను పోటీ చేస్తున్నానే అర్థం వచ్చేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తాను బడుగులకు రాజ్యాధికారం రావాలనే రాజకీయాల్లోకి వచ్చానని, బడుగులు, బహుజనులను ఏకం చేస్తానే తప్ప చీలిక తీసుకువచ్చే శక్తులను కూడా ఉపేక్షించనని రామచంద్రయాదవ్ క్లారిటీ ఇచ్చారు.