1995 నుంచి 2025 వరకు ఇది చంద్రబాబు శాసనం!

Amruth kumar
చంద్రబాబు నాయుడు అనే పేరు తెలుగు రాజకీయాల్లో ఒక బ్రాండ్. ఆయన రాజకీయ ప్రస్థానం సగం శతాబ్దం దాటినా, ఆరంభం నుంచి ఈ రోజు వరకు అదే ఉత్సాహం, అదే చాణక్యం, అదే విజన్ కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ లో చిన్న వయసులోనే మంత్రి పదవిని అందుకున్న బాబు, అక్కడినుంచే తన రాజకీయ పయనాన్ని మొదలుపెట్టి, 1995లో ఒక్కసారిగా రాష్ట్రంలోనే కాదు, దేశ రాజకీయాలను కదిలించేలా సీఎం కుర్చీని అధిరోహించారు. సెప్టెంబర్ 1, 1995 – చరిత్రాత్మక మలుపు .. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరూ ఊహించని పరిణామం జరిగింది. ఎన్టీఆర్ వంటి ప్రజానాయకుడు ఉన్న టీడీపీ లోనే, ఆయన స్థానంలో చంద్రబాబు సీఎం కావడం దేశాన్ని షాక్ కి గురి చేసింది. "నెవర్ బిఫోర్ – నెవర్ ఆఫ్టర్" అనేలా 45 ఏళ్ల వయసులో డైనమిక్ సీఎం గా బాబు సింహాసనం ఎక్కారు. ఆ రోజు నుంచి ప్రారంభమైన బాబు చాప్టర్ ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది.



అగ్నిపరీక్షలతో సత్తా చాటిన బాబు .. ఎన్టీఆర్ లేకుండా టీడీపీ నిలబడుతుందా అన్న అనుమానాల మధ్య 1996 లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. లక్ష్మీపార్వతి టీడీపీ, కాంగ్రెస్ కలిసి పెద్ద సవాల్ విసిరినా, 42 సీట్లలో 28 సీట్లు సాధించి బాబు గెలుపు జెండా ఎగరేశారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోనూ తన మాయాజాలం చూపి, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని కూర్చడంలో కీలకపాత్ర పోషించారు. విజన్‌తో నడిపిన యంగ్ సీఎం .. చంద్రబాబు తన కాలంలో టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆధునిక ఆలోచనలతో ఏపీని కొత్త పంథాలో నడిపించారు. ఐటీ హబ్ గా హైదరాబాద్ రూపుదిద్దుకోవడంలో ఆయన చేసిన కృషి అంతా అయ‌న‌చేసినదే. "సైబరాబాద్" అనే పదం అప్పటినుండే ప్రజల నోట వినిపించడం మొదలైంది.



ముహూర్త బలం – మళ్లీ మళ్లీ సీఎం .. 1995లో మొదలైన అదృష్టం 1999లోనూ తిరిగి ఆయనకే కలిసొచ్చింది. తొమ్మిదేళ్లు ఏకధాటిగా ఉమ్మడి రాష్ట్రానికి సీఎం గా నిలిచిన బాబు, ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగినా, రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఎంపికై తన రికార్డును సృష్టించారు. నాలుగుసార్లు సీఎం అయిన ఘనత ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఎవరికీ దక్కలేదు. 30 ఏళ్ల బాబు శకం .. సెప్టెంబర్ 1, 1995 నుంచి సెప్టెంబర్ 1, 2025 వరకు తెలుగు రాజకీయాలన్నీ చంద్రబాబు చుట్టూనే తిరిగాయి. జాతీయ రాజకీయాల నుంచి స్థానిక పాలన వరకూ తన ముద్రను వేసిన బాబు, ఈ ముప్పయ్యేళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నా, ఇప్పటికీ "తెలుగు రాజకీయాల చాణక్యుడు" అనే బిరుదుతో వెలుగొందుతున్నారు.మొత్తానికి చెప్పాలంటే – ఈ ముప్పయ్యేళ్లు తెలుగు రాజకీయాల్లో బాబు శకం. ఆయన చేసిన మువ్వన్నెల మాయాజాలం, చాణక్య నీతి, అభివృద్ధి దార్శనికత – ఇవన్నీ కలిపి చంద్రబాబు నాయుడిని "ఎప్పటికీ గుర్తుండే నాయకుడు"గా నిలబెట్టాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: