కార్యకర్తలకు ఏమీ చేయలేకపోయాం.. అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు వైరల్!

Reddy P Rajasekhar

గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో, పార్టీ నాయకత్వం కీలకమైన విషయాన్ని బహిరంగంగా అంగీకరించింది. కార్యకర్తలను విస్మరించడమే ఈ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటని వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నుంచి ప్రతి ఒక్కరూ గుర్తించారు. ఈ భారీ మూల్యం చెల్లించుకున్న తర్వాత, ఇప్పుడు పార్టీ విధేయులైన కార్యకర్తలను తిరిగి చైతన్యపరచడానికి మరియు వారిలో విశ్వాసం నింపడానికి నాయకులు కృషి చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, కార్యకర్తల్లో విశ్వాసం పెంచేందుకు కడప ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మైదుకూరు నియోజకవర్గంలో వైసీపీ గ్రామ కమిటీల ఏర్పాటుపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 'జగన్ 2.0' పాలన గతానికి భిన్నంగా ఉంటుందని ప్రకటించారు. ప్రధానంగా కార్యకర్తలను ముందు పెట్టి పరిపాలన చేస్తామని జగన్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

 గతంలో కోవిడ్ మహమ్మారి కారణంగా కార్యకర్తలకు అనుకున్నంత మేర సహాయం చేయలేకపోయామని జగన్ అనేకసార్లు చెప్పారని ఎంపీ అవినాష్ రెడ్డి గుర్తు చేశారు. అయితే, జగన్ 2.0 పాలనలో ఆ పరిస్థితి ఉండదని హామీ ఇచ్చారు. కార్యకర్తలను ముందుపెట్టి పాలన చేయాలనే లక్ష్యానికి కొనసాగింపుగానే ప్రస్తుతం కమిటీల నియామకం జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు.

ఇంతకాలం పార్టీ నిలబడటానికి లక్షలాది మంది కార్యకర్తల నష్టం, త్యాగం, వైఎస్సార్ ఆశీస్సులు, అలాగే జగన్‌కు ప్రజల్లో ఉన్న క్రేజ్ కారణమని అవినాష్ రెడ్డి అన్నారు. అయితే, భవిష్యత్తులో కార్యకర్తలను ముందుపెట్టి పాలన చేయాలంటే, సంస్థాగత నిర్మాణం ఉండాలి కదా అని ప్రశ్నిస్తూ, ఆ నిర్మాణమే ఈ కమిటీలని అన్నారు.

ఈ కమిటీల నియామక ప్రక్రియను ఎవరూ తేలికగా తీసుకోవద్దని అవినాష్ రెడ్డి కార్యకర్తలను కోరారు. కమిటీలన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా వేయాలని సూచించారు. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ, పార్టీపై లేదా జగన్‌పై అభిమానం ఉన్నవారిని కలుపుకొని వెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు. అయితే, కమిటీలలో మాత్రం క‌ర‌డుగ‌ట్టిన వైసీపీ కార్య‌క‌ర్త మాత్రమే ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: