రేవంత్ కేబినెట్‌లో భారీ మార్పులు..? కాంగ్రెస్‌లో చర్చలు జోరుగా!

Amruth kumar
తెలంగాణా రాజకీయ వాతావరణంలో మరోసారి హాట్ టాపిక్ ఏదైనా ఉంటే, అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మార్పుల గురించే. ముఖ్యంగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎటువంటి సభ సభ్యుడి కాకపోయినా నేరుగా మంత్రిగా ఎంపిక కావడం వెనుక హైకమాండ్ హస్తం ఉందన్నది అందరి అభిప్రాయం. ఇప్పుడు అదే హైకమాండ్ మరో పెద్ద ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.



కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే రాష్ట్ర మంత్రుల పనితీరు పై సమీక్ష ప్రారంభించింది. ప్రజల్లోకి వెళ్లని, శాఖల్లో ఫలితాలు ఇవ్వని మంత్రులపై వేటు తప్పదని రాజకీయ వర్గాల విశ్లేషణ. మరోవైపు, కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వడం ద్వారా రేవంత్ కేబినెట్‌కు కొత్త రూపు ఇవ్వాలని పార్టీ బాస్‌లు యోచిస్తున్నారట. ఈసారి మంత్రి పదవి దక్కే అవకాశాల్లో ఫైర్ బ్రాండ్ నేత విజయశాంతి పేరు బలంగా వినిపిస్తోంది. ఆమె ఇటీవలే ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. బీసీ వర్గానికి చెందిన నాయకురాలిగా, సినీ గ్లామర్ కలయికతో ప్రజల్లో విస్తృత పాపులారిటీ ఉన్న విజయశాంతిని మంత్రి వర్గంలోకి తీసుకురావాలని హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆమెకు హైకమాండ్ ఆశీస్సులు నిండుగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.



అలాగే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, సీనియర్ నేత బాలూ నాయక్‌లకు కూడా మంత్రిపదవి అవకాశాలు ఉన్నాయట. ప్రస్తుతం రెండు ఖాళీలు ఉండగా, ఈ ముగ్గురిలో కనీసం ఇద్దరికి బెర్తులు ఖాయం అవుతాయని కాంగ్రెస్ లో టాక్. అయితే మరోవైపు, కొందరు మంత్రులపై కత్తి వేలాడుతోందట. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లపై వేటు పడే అవకాశం ఉందని సమాచారం. పొన్నం ప్రభాకర్‌కు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడం ద్వారా మంత్రి వర్గం నుంచి తప్పించే అవకాశం ఉందని కూడా అంటున్నారు.



రెండేళ్ల మార్క్‌కు చేరువ అవుతున్న రేవంత్ ప్రభుత్వం ఇప్పటికీ పూర్తి సమన్వయంతో పనిచేయడం లేదని హైకమాండ్ అసంతృప్తిగా ఉందట. కొన్ని శాఖల్లో పనితీరు దెబ్బతిన్నదని స్పష్టమైన ఫీడ్‌బ్యాక్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే రాబోయే వారాల్లో భారీ రీషఫుల్ జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ లోపల జరుగుతున్న ఈ మార్పులు కేవలం మంత్రులపైనే కాదు, మొత్తం ప్రభుత్వ దిశపైన ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. రాబోయే ఎన్నికల దిశగా పార్టీ ఫోకస్ పెంచుకునే క్రమంలో, ఈ మార్పులు కీలక మలుపుగా మారవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: