జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆసక్తికరంగా మారారు.. కాంగ్రెస్ అధిష్టానం ఈయనను గుర్తించి టికెట్ అందించడంతో పాటు భారీ మెజారిటీతో గెలవడంతో ఈయన పేరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగిపోతోంది.. మరి ఈ నవీన్ యాదవ్ ఎవరు.. ఆయన బయోగ్రఫీ ఏంటి అనే వివరాలు చూద్దాం.. ఒక సాధారణ కుటుంబంలో పుట్టినటువంటి నవీన్ యాదవ్ ఈ స్థాయికి చేరారు.. తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా బాగా సంపాదించారు. ఆ తర్వాత రాజకీయ రంగంలో అడుగుపెట్టి ప్రజల మనసులు దోచాడు. 1983 నవంబర్ 17 హైదరాబాదు నగరంలోని యూసుఫ్ గూడాలో జన్మించారు. తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్, తల్లి కస్తూరి యాదవ్ గృహిణి. చిన్నప్పటినుంచి ప్రజాసేవలో మునిగిపోయిన నవీన్ యాదవ్ కు రాజకీయాల్లో చాలా ఆసక్తి ఉండటం వల్ల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు.
యూసుఫ్ గూడాలో ఎవరైనా ప్రజలు ఇబ్బంది పడితే వారి సమస్య అడిగి తెలుసుకొని అది క్లియర్ చేసేవారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టిన నవీన్ యాదవ్, కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక నవీన్ యాదవ్ రాజకీయ అరంగేట్రం చేసింది కూడా మజిలీస్ పార్టీ ద్వారానే అని చెప్పవచ్చు. 2014 ఎన్నికల్లో ఎంఐఎం టికెట్ కట్టబెట్టింది. ఆ టైంలో టిడిపి అభ్యర్థి మాగంటి గోపీనాథ్ కు వ్యతిరేకంగా పోటీ చేసి కేవలం 9,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓటమి వచ్చిన బాధపడకుండా ప్రజలతో ఉంటూ ప్రజాసమస్యలు తెలుసుకుంటూ వచ్చారు. యూత్ లో మంచి పేరు సంపాదించారు. మళ్లీ 2018లో ఎంఐఎం టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీకి రాజీనామా చేసి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 18వేల ఓట్ల తేడాతో మూడవ స్థానంలో నిలిచారు. అయినా మొక్కవోని దీక్షతో ప్రజా సమస్యలు పట్టించుకుంటూ వచ్చారు.
తన సొంత డబ్బుతో పేదలకు వైద్యం, పండగలప్పుడు చీరలు లాంటివి పంపిణీ చేస్తూ అదరహో అనిపించారు. 2023 కామన్ ఎన్నికల్లో కూడా మళ్లీ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆ తర్వాత ఓ కాంగ్రెస్ నాయకుడి వల్ల నామినేషన్ విత్ డ్రా చేసుకొని, కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత నవయువ నిర్మాణ అనే స్వచ్ఛంద సంస్థ స్థాపించి దాని ద్వారా యువతకు ఉపాధి కల్పన, ఉద్యోగ శిక్షణలు ఇప్పిస్తూ వస్తున్నారు. అప్పటినుంచి కాంగ్రెస్ లో కొనసాగుతున్న నవీన్ యాదవ్ కు ఈ ఉప ఎన్నిక అనేది ఎంతో కలిసి వచ్చింది. చివరికి రేవంత్ రెడ్డి అధిష్టానం ఈయనను గుర్తించి కాంగ్రెస్ అభ్యర్థిగా జూబ్లీహిల్స్ టికెట్ ఖరారు చేసింది.. అలా నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరగగా నవంబర్ 14న రిజల్ట్ వచ్చింది. అలా ఈరోజు వచ్చిన రిజల్ట్ లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై దాదాపు 25 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు.