కాపులు - ద‌ళితుల కాంబినేష‌న్ వ‌ర్సెస్ సునీల్ చెపుతోంది సాధ్య‌మేనా..?

RAMAKRISHNA S.S.
ప్రస్తుతం మొత్తం సోషల్ మీడియాలో ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. “ దళితులు – కాపులు ఏకం కావాలి, తద్వారా రాజ్యాధికారం సాధించాలి ” అనే ఆయన వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, మీడియా వర్గాల్లో, మేధావుల వరకూ అందరి డిబేట్ టాపిక్‌గా మారింది. ఈ ఒకే వాక్యం చుట్టూ రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కింది.


సునీల్ వ్యాఖ్యలు వివాదానికి కారణం కావడానికి ప్రధాన కారణం అతను ఒక ఐపీఎస్ అధికారి కావడం. రాజకీయ నాయకులు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే అది ఒక రాజకీయ వ్యూహంగా భావించబడుతుందని చాలా మంది అంటున్నారు. కానీ ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి ఇలాంటి సామాజిక , రాజకీయ పిలుపు ఇవ్వడం మరింత సెన్సిటివ్ అంశం కావడంతో, ఇది ఇప్పుడు పెద్దదిగా మారింది. అసలు విషయానికి వస్తే “కాపుల రాజ్యాధికారం”, “దళితుల రాజ్యాధికారం” అనే నినాదాలు కొత్తవి కావు. 2007లో ప్రజారాజ్యం పార్టీ పుట్టుకకూ ఇలాంటి నినాదాలు మంచి బలం ఇచ్చాయి. 1980లలో వంగవీటి మోహన్ రంగా జరిపిన “కాపు నాడు” సమావేశాలు భారీ స్పందన తెచ్చుకున్నాయి.
అంతకంటే ముందుగా ముద్రగడ పద్మనాభం, దాసరి నారాయణరావు వంటి నాయకులు కూడా కాపుల సామాజిక శక్తిని రాజకీయంగా ఏకం చేసేందుకు చేసిన కృషి తెలిసిందే.


ఇప్పుడు అదే తరహాలో దళితుల సామాజిక ఉద్యమాల చరిత్రను చూస్తే కాకా వెంకట స్వామి, మందకృష్ణ మాదిగ, శివాజీ వంటి నాయకులు దళిత పక్షపాత రాజకీయాల కోసం చేసిన పోరాటాలు కూడా బలమే.
ఈ రెండు వర్గాల లక్ష్యం కాలానుగుణంగా ఒకటే రాజ్యాధికారం సాధించడం.  ఇప్పుడు ఈ రెండు వర్గాలు నిజంగా ఏకం కావడం సాధ్యమా ?  అంటే చరిత్ర చెప్పే సమాధానం అంత సానుకూలంగా లేదు. కాపులలో గతంలోనే ఏకాభిప్రాయం రాలేకపోయింది. దళితుల్లో ఇప్పటికీ అంతర్గత విభజనలు ఉన్నాయి. కుల ఉపవిభజనలు, ఉద్యమాల వైఖరిల మధ్య అంతరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండు వేర్వేరు సామాజిక వర్గాలు ఒకే రాజకీయ లక్ష్యంతో, ఒకే బ్యానర్ కింద ముందుకు రావడం అషామాషి అయితే కాదు.


ఇక సునీల్ వ్యాఖ్యల తర్వాత రాజకీయ ప్రయోజనం కోసం ఈ నినాదాన్ని కొన్ని వర్గాలు సపోర్ట్ చేస్తాయో, మరికొన్ని వర్గాలు దానికి వ్యతిరేకిస్తాయో అనేది ఖాయం. ఈ నేప‌థ్యంలోనే సునీల్ వాదన సిద్ధాంతంగా ఆకర్షణీయంగా ఉన్నా… ప్రాక్టికల్‌గా రాజకీయాల్లో ఎంత వ‌ర‌కు సాధ్యం అవుతుంది అనేది అతిపెద్ద ప్రశ్నగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: