మ‌నిషేమో వైసీపీలో ఉన్నాడు.. మ‌న‌సేమో కూట‌మిలో ఉందా...?

RAMAKRISHNA S.S.
ఏపీ రాజకీయాల్లో ప్రతి నియోజకవర్గం పరిస్థితి ఒక్కోలా రూపుదాల్చుతోంది. ప్రభుత్వం చేసే పనులపై విమర్శలు ఉండొచ్చు, సర్కార్‌ పార్టీ నేతల వ్యవహారం ఎలా ఉన్నా ఉండొచ్చు .. కానీ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నాయకుల ప్రవర్తన మాత్రం చాలా చోట్ల ఆశ్చర్యపరుస్తోంది. ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా, కనీసం ప్రతిపక్ష ధోరణితోనైనా వ్యవహరించాల్సిన పరిస్థితుల్లో కూడా ఆ పార్టీ నేతలు అంతర్గతంగా చేస్తున్న రాజకీయాలు కొన్నిచోట్ల గందరగోళంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గం ఉదాహరణగా తీసుకుంటే, అక్కడి రాజకీయ సమీకరణాలు ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తున్నాయి. గత మూడు ఎన్నికల్లో 2014, 2019 మరియు 2024లో వైసీపీ వరుస విజయాలు సాధించింది. ఆలూరులో తన బలం కోల్పోకుండా నిలిచింది. 2024 ఎన్నికల్లో పార్టీ తరఫున బరిలో దిగిన విరూపాక్షి మరోసారి విజయం సాధించినా, ఆయన తరువాత ప్రవర్తన మాత్రం పార్టీలో అంతర్గత అనుమానాలకు దారితీస్తోంది.


ఆయ‌న గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో విజయం సాధించినప్పటి నుంచి ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని, అంతేకాక కూటమి పార్టీల నేతలతో కలిసి తిరుగుతున్నారనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. ఈ వాదనలు కేవలం వర్గపోరు స్థాయిలో కాకుండా, బహిరంగంగానే పార్టీ లోపల వినిపించడం గమనార్హం. ఇటీవల పార్టీ కార్యకర్తల సమావేశంలో విరూపాక్షి చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు మరింత బలం చేకూరేలా చేశాయి. నియోజకవర్గంలో ప్రభుత్వ పనులు జరగాలంటే తాను ఒంటరిగా ఏమీ చేయలేనని, అందుకోసం ఇతర నేతలతో కలిసి పనిచేస్తున్నానని ఆయన స్పష్టంగా చెప్పినట్లు సమాచారం.


సాధార‌ణంగా కేసులు, అభియోగాలు లేదా ఒత్తిడి ఉన్నవారే కూటమి లేదా ఇతర పార్టీల నేతలతో దగ్గరగా ఉంటారని. కానీ విరూపాక్షి విషయంలో అలాంటి పరిస్థితి లేకపోయినా, కూటమి నాయకుల సన్నిహితంగా కనిపించడం పార్టీ వర్గాల్లో అయోమయాన్ని పెంచుతోంది. ఆయన చేస్తున్న రాజకీయాలు నిజంగా నియోజకవర్గ ప్రయోజనాల కోసమేనా? లేక భవిష్యత్తు రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముందుగానే కూట‌మితో ట‌చ్‌లో ఉంటున్నారా ? అన్న చ‌ర్చ‌లు కూడా తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. విరూపాక్షిపై వస్తున్న విమర్శలు పెరుగుతున్నా, ఈ పరిస్థితిపై వైసీపీ హైకమాండ్‌ మాత్రం నిశ్శబ్ద ధోరణితో వ్యవహరిస్తుందనేది మరో ఆసక్తికర అంశం. పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, ఆయనపై ఎలాంటి హెచ్చరికలు లేదా సూచనలు చేయకపోవడం వల్ల, విరూపాక్షి కి ఈ నిశ్శబ్దం ఒక రకంగా రక్షణగా మారిందనే వ్యాఖ్యలు వెలువడుతున్నాయి.


ఇటీవల టిడిపి నేత మరియు మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యలు చర్చలకు మరింత ఊపిరి పోశాయి. “ఆలూరు నియోజకవర్గం కూడా మనదే” అని ఆయన ప్రకటించడం, విరూపాక్షి గత కొంతకాలంగా కూటమి నేతలతో కలిసిమెలిసి తిరుగుతున్నారనే వాదనకు ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. దీంతో, విరూపాక్షి రూపకల్పన చేస్తున్న అంతర్గత రాజకీయం ఏమిటనేదానిపై అనేక ప్రశ్నలు లేవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: