రేవంత్ ఢిల్లీ టూర్.. కేబినెట్ నుంచి ఎవరు అవుట్..?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీ పర్యటన చేపట్టడం వెనుక మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన కీలక అంశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో కొన్ని మంత్రి పదవులు ఖాళీగా ఉండటం, అదే సమయంలో పదవులు ఆశిస్తున్న ఆశావహులు కూడా ఎక్కువగా ఉండటంతో, ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.
రేవంత్ రెడ్డి సత్తాపై నమ్మకం :
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం, అలాగే పంచాయతీ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు రావడంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్తా మీద పార్టీ అధిష్టానానికి నమ్మకం పెరిగిన నేపథ్యం ఉంది. ఈ సానుకూల పరిస్థితుల్లోనే, హైకమాండ్‌ను ఒప్పించి, మెప్పించి మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ఆయన చూస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా కేబినెట్‌లో మార్పులు చేర్పుల గురించి ప్రస్తావించి, 'ఏమైనా జరగవచ్చు' అన్నట్లుగా మాట్లాడారు. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేపట్టడంతో ఊహాగానాలు ఒక్కసారిగా పెరిగాయి.
పనితీరు ఆధారంగా మార్పులు చేర్పులు:
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఇంకా మూడేళ్ల పాలన ఉంది. ఈ రెండేళ్ల వ్యవధిలో రెండు సార్లు మంత్రివర్గ విస్తరణ జరిగింది. తాజాగా, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ముందు అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇప్పుడు మరో రెండు ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా, పనితీరు ఆధారంగా కనీసంగా ముగ్గురు, నలుగురు మంత్రులను పక్కన పెట్టి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నట్లు తాజా సమాచారం. దీనిపై సీరియస్‌గా ఢిల్లీ పెద్దలతో చర్చించడానికే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారని అంటున్నారు.
సరైన సమయం ఇదేనా ..?
మరో మూడేళ్ల సమయం ఉన్నప్పటికీ, ఇప్పుడే విస్తరణ చేపడితే రానున్న రెండేళ్లూ కొత్త మంత్రులు గట్టిగా పనితీరుని చూపించుకోవచ్చునని, చివరి ఏడాది ఎన్నికల సంవత్సరం కాబట్టి, మిగిలిన ఈ రెండేళ్ల కాలంలోనే విస్తరణ జరపడం భావ్యమని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఆశావహులను ఎక్కువ కాలం ఉంచడం లేదా జాప్యం చేయడం మంచిది కాదని రేవంత్ అభిప్రాయంగా తెలుస్తోంది. ప్రభుత్వంపై మరింత పాజిటివిటీని పెంచుకునేందుకు పనితీరు సరిగ్గా లేని వారిని పక్కన పెట్టి, అవసరమైన వారిని కేబినెట్‌లో చోటివ్వాలన్నది కాంగ్రెస్ పెద్దల ఆలోచనగా ఉంది.
ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు మూడో విడత ఈ నెల 17తో ముగియనుంది. ఆ తర్వాత మంచి ముహూర్తం చూసి కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేపట్టాలని భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో బాగా పనిచేసిన వారికి, అలాగే వివిధ సామాజిక వర్గాలు, ప్రాంతాలు ఆధారంగా కూర్పు మార్పు చేయాలని చూస్తున్నారు. సీఎం రేవంత్ ఈ విస్తరణలో 'ఎన్నికల కేబినెట్'ను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ హైకమాండ్ ఏ మేరకు అవకాశం ఇస్తుంది అన్నది చూడాలి. కాంగ్రెస్‌లో మంత్రివర్గ మార్పులు చేర్పులు పెద్ద ఎక్సర్‌సైజ్ కావడంతో, పదవి రాని వారు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో, తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.