షర్మిల జీవితంలో అనూహ్యంగా వచ్చిన అన్నయ్యలు..దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది..!

Thota Jaya Madhuri
ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిన్న తన 51వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష నేతల నుంచి వచ్చిన పుట్టినరోజు సందేశాలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా వైఎస్ షర్మిలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. “ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆమెకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను” అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్థాయి నేత నుంచి ఈ తరహా శుభాకాంక్షలు రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.



అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా షర్మిలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంతుడు ఆమెకు చిరాయువు, సుఖసంతోషాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ తన సందేశాన్ని వెల్లడించారు. అంతేకాదు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ప్రత్యేకంగా షర్మిలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం గమనార్హం.ఈ ముగ్గురు కీలక నేతలు వరుసగా శుభాకాంక్షలు తెలియజేయడంతో ఇది రాజకీయంగా ఒక పెద్ద మలుపుగా పలువురు విశ్లేషిస్తున్నారు. ఒకవైపు అధికార కూటమి నేతలు షర్మిలను గౌరవిస్తూ శుభాకాంక్షలు చెబుతుంటే, మరోవైపు ఆమె సొంత అన్నయ్య, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం బహిరంగంగా ఎలాంటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయకపోవడం తీవ్ర చర్చకు దారి తీసింది.



ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. “సొంత అన్నయ్య పట్టించుకోలేదు కానీ ఇతర పార్టీల నేతలు మాత్రం గౌరవంగా విషెస్ చెప్పారు” అంటూ కొందరు విమర్శాత్మకంగా స్పందిస్తున్నారు. మరికొందరు అయితే “షర్మిలకు దేవుడు ఇచ్చిన కొత్త అన్నయ్యలు వీళ్లే” అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌లను ఉద్దేశించి వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు.వైఎస్ కుటుంబంలో అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న రాజకీయ విభేదాలు ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి – వైఎస్ షర్మిల మధ్య రాజకీయ దూరం పెరిగిన నేపథ్యంలో, ఈ పుట్టినరోజు సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు మరోసారి ఆ విభేదాలను స్పష్టంగా చూపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



ఇక మరోవైపు, ప్రస్తుతం అధికారంలో ఉన్న ఏపీ కూటమి ప్రభుత్వంతో వైఎస్ షర్మిల భవిష్యత్తులో కలిసి పనిచేస్తారా? రాజకీయంగా చేతులు కలుపుతారా? అనే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అధికార కూటమి నేతల నుంచి వచ్చిన ఆత్మీయ శుభాకాంక్షలు, భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలపై ఏమైనా ప్రభావం చూపుతాయా? అన్నది వేచి చూడాల్సిన అంశంగా మారింది.మొత్తానికి, వైఎస్ షర్మిల 51వ జన్మదినం సందర్భంగా వచ్చిన శుభాకాంక్షలు కేవలం వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా, రాజకీయంగా కూడా పెద్ద చర్చకు కారణమవుతూ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఊహాగానాలకు తెరలేపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: