టీడీపీ ఎమ్మెల్యే అసహనానికి కారణాలివే.. అసలేం జరిగిందంటే?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలకు పొంతన ఉండటం లేదనే విమర్శలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే తమ అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేస్తుండటం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు వ్యవహారశైలి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. తన నియోజకవర్గంలో పారిశుధ్య పరికరాల పంపిణీ విషయంలో అధికారుల నిర్లక్ష్యంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కళ్యాణదుర్గం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీలకు పారిశుధ్య పరికరాల పంపిణీ కోసం నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు కాకుండా కేవలం రెండు గ్రామాలకు మాత్రమే పరికరాలు అందజేస్తున్నారని తెలుసుకున్న ఆయన తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఇలాంటి అరకొర ఏర్పాట్ల మధ్య కార్యక్రమానికి రావడం కంటే రాకుండా ఉండటమే మేలని ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై త్వరలోనే జిల్లా కలెక్టర్‌తో చర్చిస్తానని చెబుతూ, మధ్యలోనే కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్లిపోవడం అధికార పార్టీలో చర్చకు దారితీసింది.
అయితే ఈ అసంతృప్తి వెనుక అసలు కథ వేరే ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే వ్యవహారశైలిపై టీడీపీ అధిష్టానం ఇప్పటికే అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా స్టాంపుల కుంభకోణం, మద్యం షాపుల టెండర్ల ప్రక్రియలో అమిలినేని పేరు వినిపించడంతో ఆయన ప్రతిష్ట మసకబారిందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలోనే ఆయనను దూరం పెడుతున్నారని, దానికి కౌంటర్‌గానే ఎమ్మెల్యే ఈ రకమైన అసహనాన్ని ప్రదర్శిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ క్రమశిక్షణను దాటి వ్యవహరిస్తున్న నేతలపై చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారన్న వార్తల మధ్య, అమిలి నేని సురేంద్రబాబు భవిష్యత్ అడుగులు ఏ విధంగా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.