అంబటి వర్సెస్ రజనీ.. వైసీపీలో ముదురుతోన్న వివాదం...!
మోపిదేవి నిష్క్రమణతో మొదలైన సంక్షోభం :
రేపల్లె రాజకీయాల్లో మోపిదేవి వెంకటరమణ కీలక నేత. వచ్చే ఎన్నికల్లో ఆయన వారసుడిని బరిలోకి దింపాలని వైసీపీ భావించినప్పటికీ, అనూహ్య పరిణామాల మధ్య ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు. దీంతో రేపల్లెలో వైసీపీ ఒక్కసారిగా బలహీనపడింది. బలమైన స్థానిక నాయకత్వం లేకపోవడంతో, అధిష్టానం ఇతర నియోజకవర్గాల వైపు చూడటం మొదలుపెట్టింది.
అంబటి రాంబాబు వెనకడుగు :
తొలుత ఈ సీటును మాజీ మంత్రి అంబటి రాంబాబుకు అప్పగించాలని అధిష్టానం భావించింది. గతంలో ఆయన ఇక్కడ విజయం సాధించిన అనుభవం ఉండటంతో, ఆయనైతే గట్టి పోటీ ఇస్తారని భావించారు. అయితే, అంబటి క్షేత్రస్థాయిలో సర్వే చేయించుకోగా పరిస్థితులు అనుకూలంగా లేవని తేలింది. ముఖ్యంగా ప్రస్తుత మంత్రి అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గంపై పట్టు సాధించడం .. మోపిదేవి వంటి నేత టీడీపీలో చేరడంతో ఆ పార్టీ బలం రెట్టింపు అవ్వడం. ఈ కారణాలతో అంబటి రేపల్లెకు రావడానికి విముఖత వ్యక్తం చేశారు.
విడుదల రజనీ అయిష్టత :
అంబటి తప్పుకోవడంతో, బీసీ కార్డును ప్రయోగించి విడుదల రజనీని రేపల్లె బరిలోకి దించాలని వైసీపీ ప్లాన్ చేసింది. బీసీ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటం ఆమెకు కలిసొస్తుందని భావించినా, రజనీ మాత్రం అందుకు సిద్ధంగా లేరు. "అంబటి వద్దనుకున్న సీటును నేను తీసుకోవడం ఏంటి?" అన్నది ఆమె ప్రధాన వాదనగా వినిపిస్తోంది. పైగా అనగాని సత్యప్రసాద్‌ను ఢీకొట్టడం ప్రస్తుతం అంత సులభం కాదని ఆమె భావిస్తున్నారు. తనకు మళ్ళీ చిలకలూరిపేట ఇస్తే పోటీ చేస్తానని, లేదంటే రాజకీయాలకు దూరంగా ఉంటాననే సంకేతాలను ఆమె పంపుతున్నట్లు సమాచారం. మొత్తానికి రేపల్లె వైసీపీలో 'మ్యూజికల్ చైర్' ఆట సాగుతోంది. సీనియర్ నాయకులు పోటీకి భయపడుతుండటంతో పార్టీ క్యాడర్ అయోమయంలో ఉంది. జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రతిష్టంభనను ఎలా తొలగిస్తారో వేచి చూడాలి.