వాళ్ల మీదే జగన్ ఫుల్ ఫోకస్ ... !
జనవరి నుంచి జగన్ స్వయంగా ప్రజల్లోకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికి ముందుగా, క్రిస్మస్ పండుగ తర్వాత గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలతో ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ప్రతి ఎమ్మెల్యే పనితీరును అంచనా వేయడానికి ఒక ప్రత్యేక టైమ్ టేబుల్‌ను పార్టీ సిద్ధం చేసింది. నియోజకవర్గాల్లో పార్టీ గ్రాఫ్ ఎలా ఉంది ? ఎమ్మెల్యేలు ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు ? అనే అంశాలపై జగన్ ఆరా తీస్తున్నారు. స్థానిక సమస్యలపై పోరాటంలో ఎమ్మెల్యేల పాత్రను ఆయన సమీక్షించనున్నారు. ముఖ్యంగా వ్యాపారాల పేరుతో పార్టీకి దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలకు జగన్ గట్టిగానే క్లాస్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే, తమపై కావాలని వ్యతిరేక ప్రచారం జరుగుతోందని సాకులు చెబుతున్న వారి పనితీరును కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. "ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. పట్టు బిగిస్తున్నాం" అని పార్టీ కీలక నేతలు చెబుతున్నారు.
మొత్తానికి, విపక్షంలో ఉన్నప్పుడు మరింత చురుగ్గా ఉండాల్సిన ఎమ్మెల్యేలు స్తబ్దుగా ఉండటాన్ని జగన్ సీరియస్‌గా తీసుకున్నారు. ఈ భేటీల ద్వారా ఎమ్మెల్యేలను మళ్లీ యాక్టివ్ చేసి, క్షేత్రస్థాయిలో వైసీపీ క్యాడర్‌లో ధైర్యం నింపడమే జగన్ అసలు వ్యూహం. మరి జగన్ ఇచ్చే ఈ ‘డోస్’ తర్వాత ఎమ్మెల్యేల తీరులో ఎలాంటి మార్పు వస్తుందో చూడాలి.