రేవంత్ కూల్ పాలిటిక్స్‌ Vs కేటీఆర్ ప్ర‌స్టేష‌న్ పాలిటిక్స్ ... ?

RAMAKRISHNA S.S.
- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ )

తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఒక రసవత్తరమైన 'మైండ్ గేమ్'ను తలపిస్తోంది. రాజకీయాల్లో వ్యూహప్రతివ్యూహాలు సహజమే అయినా, ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం పైచేయి సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం రేవంత్ విసిరిన రాజకీయ బాణాలు బీఆర్ఎస్ అగ్రనేతలను ఆత్మరక్షణలో పడేశాయి. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించడంతో రేవంత్ రెడ్డి చాలా కూల్‌గా ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే, ఆయన మాటల్లోని గూఢార్థం బీఆర్ఎస్ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టించింది. కేటీఆర్ నాయకత్వంలో పార్టీ వరుసగా ఓడిపోతోందని చెబుతూనే, హరీష్ రావు పార్టీ పగ్గాల కోసం ప్రయత్నిస్తున్నారన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలు మంట పుట్టించాయి. దీనిపై హరీష్ రావు వెంటనే స్పందిస్తూ.. తనకూ, కేటీఆర్‌కూ మధ్య చిచ్చు పెట్టొద్దని, తన గుండెల్లో ఎప్పటికీ కేసీఆరే ఉంటారని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే కవిత వర్గం నుంచి వస్తున్న ఒత్తిడికి తోడు, రేవంత్ వ్యాఖ్యలు హరీష్‌ను మరింత ఫ్రస్ట్రేషన్‌కు గురిచేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


కేటీఆర్ మాటల్లో అసహనం.. ?
మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరు కూడా చర్చనీయాంశంగా మారింది. పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ పుంజుకుందని చెబుతున్నా, ఆయన మాటల్లో ఆ ఉత్సాహం కంటే ఎక్కువగా ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోందనే విమర్శలు ఉన్నాయి. సీనియర్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వాడుతున్న భాష ఆయన స్థాయికి తగవని కొందరు అభిప్రాయపడుతున్నారు. గత పదేళ్లలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్న బీఆర్ఎస్, ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటూ అసహనానికి గురవ్వడం రేవంత్ రెడ్డి మైండ్ గేమ్‌లో భాగమేనని తెలుస్తోంది.


కేసీఆర్ రీ - ఎంట్రీ తప్పదా.. ?
సిరిసిల్లలో కేటీఆర్ పట్టు కోల్పోవడం, సిద్దిపేటలో హరీష్ రావు మెజార్టీ స్థానాలు గెలవడం పార్టీలో అంతర్గత సమీకరణాలను మారుస్తోంది. రేవంత్ రెడ్డి వ్యూహాలను తట్టుకోవాలంటే కేటీఆర్, హరీష్ రావుల వల్ల కాదని, మళ్ళీ కేసీఆర్ రంగంలోకి దిగాల్సిందేనని కేడర్ బలంగా నమ్ముతోంది. ఈ క్ర‌మంలోనే ఆదివారం జ‌రిగే బీఆర్ఎస్ఎల్పీ సమావేశం పార్టీ భవిష్యత్తుకు కీలకం కానుంది. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కాకుండా కేసీఆర్ ప్రజల్లోకి వస్తేనే రేవంత్ స్పీడ్‌కు బ్రేక్ పడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. రాజకీయ మైండ్ గేమ్‌లో రేవంత్ విసిరిన వలకు చిక్కకుండా బీఆర్ఎస్ ఎలా బయటపడుతుందనేది బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ త‌ర్వాత ఓ క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: