ఈ క‌థ వేరు.. అంద‌రి లెక్క‌లు తేలుస్తా.. అంటోన్న కేసీఆర్‌...?

RAMAKRISHNA S.S.
- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ )

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి మొదలైంది. సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయ కార్యాచరణను ప్రకటించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో దాదాపు మూడు గంటల పాటు పార్టీ నేతలతో చర్చించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు కావాల్సినంత సమయం ఇచ్చామని, ఇకపై ప్రజల తరపున పోరాటం మొదలు పెడతామని స్పష్టం చేశారు.


పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై విమర్శలు :
కేసీఆర్ తన ప్రసంగంలో ప్రధానంగా పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై దృష్టి సారించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు డీపీఆర్ ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇందులో బీజేపీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యారని కేసీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు కోసం రూ. 27 వేల కోట్లు ఖర్చు చేశామని, దాదాపు 80 నుంచి 90 శాతం పనులు పూర్తి చేశామని ఆయన గుర్తు చేశారు. మోటార్లు కూడా బిగించామని, కేవలం మిగిలిన పనులను పూర్తి చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు.


ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు :
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ "దద్దమ్మ ప్రభుత్వం", "సర్వభ్రష్ట ప్రభుత్వం" అని అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లు అనిపించడం లేదని, పాలకులంతా నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పాలన గాలికొదిలేసి, కేవలం ప్రభుత్వ భూములను అమ్ముకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు.


చంద్రబాబుపై విమర్శలు:
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు కేవలం పునాది రాళ్లు వేశారే తప్ప, పనులు చేయలేదని, తమ హయాంలోనే చెక్ డ్యామ్‌ల ద్వారా నీటి కష్టాలు తీర్చామని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల కోసం మళ్ళీ ఉద్యమ బాట పడతామని కేసీఆర్ ప్రకటించారు. వచ్చే 15 రోజుల్లో మూడు భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభలకు తాను స్వయంగా హాజరై, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతానని వెల్లడించారు.


కేసీఆర్ రీ ఎంట్రీ - రాజకీయ విశ్లేషణ :
దక్షిణ తెలంగాణ (పాలమూరు, రంగారెడ్డి) ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీకి ఇంకా పట్టు ఉందని భావిస్తున్న కేసీఆర్, ఆ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి ఈ ప్రాజెక్టును ఆయుధంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే, కేసీఆర్ విమర్శలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన పనులపై ఎలాంటి ఆధారాలు బయటపెడుతుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: