కేసీఆరూ చంద్ర‌బాబు శిష్యుడే క‌దా... ?

RAMAKRISHNA S.S.
- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ )

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్య సాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ రాజకీయ నేపథ్యం మరియు రాబోయే ఎన్నికలపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ - బీఆర్ఎస్ సయోధ్య గురించి స్పందిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి మధ్య అంతర్గత ఒప్పందం  కుదిరిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా, కేంద్రం ఇప్పటివరకు అనుమతి ఇవ్వకపోవడాన్ని ఆయన ఎత్తిచూపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను విచారించేందుకు కూడా కేంద్రం నుంచి అనుమతి రాకపోవడం వెనుక కేసీఆర్-బీజేపీ సయోధ్య ఉందని రేవంత్ విమర్శించారు.


కేసీఆర్ - చంద్రబాబు శిష్యుడనే విమర్శ :
కేసీఆర్ తన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్ మరియు టీడీపీలో ప్రారంభించిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్ ప్రాథమికంగా చంద్రబాబు నాయుడి శిష్యుడేనని, ఆయనకు మంత్రి పదవి ఇచ్చింది కూడా చంద్రబాబేనని రేవంత్ వ్యాఖ్యానించారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు చేపట్టిన కృష్ణా-గోదావరి అనుసంధానాన్ని మెచ్చుకున్నారని, ఇప్పుడు మాత్రం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
రాబోయే పంచాయతీ ఎన్నికల ఫలితాలపై రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తూ కేసీఆర్‌కు సవాల్ విసిరారు.


87 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, కేవలం 6 చోట్ల మాత్రమే బీఆర్ఎస్ ప్రభావం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో నిజనిర్ధారణ కమిటీ వేయడానికైనా తాను సిద్ధమని ప్రకటించారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం తెచ్చిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై కేసీఆర్, కేటీఆర్ భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. చర్లపల్లి, నాచారం వంటి పారిశ్రామిక వాడలను తరలించాలని కేసీఆర్ అంటుంటే, తాము తెచ్చిన హిల్ట్ పాలసీని కేటీఆర్ వ్యతిరేకిస్తున్నారని.. ఈ తండ్రీ కొడుకులకే ఒక స్పష్టత లేదని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: