"ఒక్క పంచాయతీ.. ఇద్దరు సర్పంచ్‌లు"..సినిమాకి మించిపోయే ట్విస్ట్లు..క్లైమ్యాక్స్ తెలిస్తే నరాలు కట్ అయిపోతాయ్...!

Thota Jaya Madhuri
సాధారణంగా ఏ ఎన్నికలైనా ఒక స్థానానికి ఒకరే విజేతగా ప్రకటించబడతారు. కానీ మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండలం, దామరవంచ గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికలు మాత్రం ఎన్నికల చరిత్రలో అరుదైన, విచిత్రమైన ఘటనకు తెరలేపాయి. ఒకే సర్పంచ్ పదవికి ఇద్దరు అభ్యర్థులను విజేతలుగా ప్రకటించి, ఇద్దరికీ అధికారిక గెలుపు ధ్రువపత్రాలు జారీ చేయడం ద్వారా ఎన్నికల అధికారులు కొత్త రికార్డు సృష్టించారు. ఈ ఘటన గ్రామంలోనే కాకుండా జిల్లా, రాష్ట్ర స్థాయిలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ విచిత్ర ఘటనకు కారణమైన సంఘటనలు ఓట్ల లెక్కింపు రోజున ప్రారంభమయ్యాయి. మొదటగా నిర్వహించిన ఓట్ల లెక్కింపులో బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన స్వాతి మూడు ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆమెకు గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని కూడా అందజేశారు. ఈ వార్తతో స్వాతి వర్గీయులు, అనుచరులు ఆనందోత్సాహాల్లో మునిగి, గ్రామంలో సంబరాలు ప్రారంభించారు.



అయితే, ఈ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. సరిగ్గా అరగంట కూడా గడవకముందే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రీ-కౌంటింగ్ నిర్వహించామని, లేదా సాంకేతిక కారణాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటూ, కాంగ్రెస్ మద్దతుదారు సుజాత ఒక ఓటు తేడాతో విజయం సాధించినట్లు మరోసారి ప్రకటించారు. అంతేకాదు, ఆమెకూ అధికారిక విక్టరీ సర్టిఫికెట్‌ను అందజేశారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి గందరగోళంగా మారింది.ఎన్నికల అధికారుల నుంచే అధికారికంగా గెలుపు పత్రాలు అందడంతో, ఇద్దరు అభ్యర్థులు తామే సర్పంచ్‌లమని భావించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి తమ బంధువులు, సన్నిహితులు, మద్దతుదారులను ఆహ్వానించారు. గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. అయితే అసలు విషయం వెలుగులోకి రావడంతో గ్రామ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.



“ఒకే కుర్చీలో ఇద్దరం ఎలా కూర్చుంటాం?” అని అభ్యర్థులు ప్రశ్నిస్తుంటే, దానికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో అధికారులు నీళ్లు నములుతున్నారు. ఎన్నికల ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యం, అసమర్థత వల్లే ఒకే గ్రామంలో ఇద్దరు సర్పంచ్‌లు తయారయ్యే పరిస్థితి ఏర్పడిందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తేలా చేసిన ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారులు ఎలా పరిష్కరిస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. అసలు విజేత ఎవరు? రీ-కౌంటింగ్ నిజంగా జరిగిందా? లేక ప్రక్రియలో తీవ్రమైన తప్పిదాలే జరిగాయా? అన్న పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ చిక్కుముడిని అధికారులు ఎలా విప్పుతారో, చివరికి దామరవంచ గ్రామానికి ఎవరు నిజమైన సర్పంచ్‌గా బాధ్యతలు చేపడతారో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: