జ‌గ‌న్ ర‌ప్పా ర‌ప్పా బ్యాన‌ర్లు వేస్తే మీ షాపు సీజ్ అయిన‌ట్టే... !

RAMAKRISHNA S.S.
- ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరమైన వ్యాఖ్యలు, వివాదాస్పద ప్లెక్సీల వ్యవహారం ఇప్పుడు పోలీసుల కఠిన చర్యలకు దారితీస్తోంది. ముఖ్యంగా ‘రప్పా.. రప్పా’ అనే పదాల‌తో హింసను ప్రేరేపించేలా ఉన్న బ్యానర్లపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కేవలం ప్లెక్సీలు ఏర్పాటు చేసిన వారే కాకుండా, వాటిని ముద్రించిన షాపులపై కూడా కేసులు నమోదు చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.


నల్లజర్లలో ప్రింటింగ్ షాపు సీజ్ :
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలోని ‘రాయల్ ఫ్లెక్సీ ప్రింటింగ్’ దుకాణంపై పోలీసులు కేసు నమోదు చేసి, దానిని సీజ్ చేశారు. శాంతిభద్రతలకు భంగం కలిగించేలా, రెచ్చగొట్టే వాక్యాలతో కూడిన ప్లెక్సీలను ముద్రించినందుకు ఈ చర్య తీసుకున్నట్లు ద్వారకాతిరుమల ఎస్సై సుధీర్ తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం రామసింగవరంలో వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక ప్లెక్సీ తీవ్ర దుమారం రేపింది.


ఆ ప్లెక్సీలో ఉన్న వాక్యాలు ఇలా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో 88 మ్యాజిక్ ఫిగర్ దాటగానే గంగమ్మ జాతరలో వేటతలలు నరికినట్లు రప్పా.. రప్పా.. నరుకుతాం ఒక్కొక్కడిని అంటూ హింసను ప్రోత్సహించేలా, ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై స్థానికులు మరియు టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు, సదరు ప్లెక్సీని ఏర్పాటు చేసిన ఆరుగురు వ్యక్తులతో పాటు, దానిని ముద్రించిన దుకాణంపై కూడా కేసు నమోదు చేశారు.


పోలీసుల హెచ్చరిక :
రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఇటువంటి రెచ్చగొట్టే చర్యలను సహించబోమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ప్లెక్సీలు ప్రింట్ చేసే ముందు అందులోని సమాచారం అభ్యంతరకరంగా ఉందా లేదా అని చూసుకోవాలని, ఒకవేళ వివాదాస్పద వాక్యాలు ఉంటే వాటిని ముద్రించకూడదని హెచ్చరిస్తున్నారు. రాజకీయ వైషమ్యాలను పెంచేలా, వ్యక్తులను ఉద్దేశించి హింసాత్మక వ్యాఖ్యలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని వెల్లడించారు.


మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ‘రప్పా రప్పా’ అనే పదాన్ని సమర్థించడం వల్లనే కార్యకర్తలు అతిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా, రాజకీయ ఉత్కంఠ నెలకొన్న ప్రస్తుత తరుణంలో పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పద ప్రచారాలకు అడ్డుకట్ట వేస్తుందని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: