ఇమ్రాన్ ఖాన్ 'మాస్' పోరాటం: 17 ఏళ్ల జైలు శిక్షపై నిప్పులు.. పాకిస్థాన్‌లో 'ఆసిమ్ లా' అరాచకం!
ఈ నేపథ్యంలో ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన ఇమ్రాన్ ఖాన్… తన పార్టీ నేత సోహైల్ అఫ్రిదికి బహిరంగ సందేశం ఇచ్చారు. “వీధి ఉద్యమానికి సిద్ధంగా ఉండాలి. హక్కుల కోసం యావత్ దేశం లేచిరావాలి. న్యాయం కోసం పోరాటం పవిత్ర బాధ్యత. నా దేశానికి నిజమైన స్వేచ్ఛ కోసం ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధం” అంటూ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. ఈ మాటలు పాకిస్తాన్ యువతలో మళ్లీ కదలికలు తెస్తున్నాయి. ఇదే సమయంలో పాకిస్తాన్ పూర్తిగా “ఆసిమ్ చట్టం” ఆధీనంలో నడుస్తోందని ఇమ్రాన్ తీవ్ర ఆరోపణలు చేశారు. “ఇక్కడ తీర్పులు ముందే రాస్తున్నారు. కోర్టుల్లో బహిరంగంగా చదివి వినిపించడమే మిగిలింది. గత మూడేళ్లుగా ఆధారాల్లేని తీర్పులే వస్తున్నాయి. బహుమతి కేసు తీర్పు కూడా అదే కోవకు చెందింది” అంటూ న్యాయవ్యవస్థపై ఘాటు విమర్శలు చేశారు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా, చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేయకుండానే తొందరపాటులో తీర్పు ఇచ్చారని ఆయన మండిపడ్డారు.
తన నిర్బంధంపై కూడా ఇమ్రాన్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జైలులో తమపై మానసిక వేధింపులు జరుగుతున్నాయని, తనకు, బుష్రా బీబీకి పుస్తకాలు, టీవీ, ములాఖత్ సౌకర్యాలు ఇవ్వడం లేదని చెప్పారు. ఇతర ఖైదీలకు అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ తమ విషయంలో మాత్రం అధికారులు వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. కుటుంబ సభ్యులు పంపిన పుస్తకాలను కూడా జైలు అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారని, వారాల తరబడి ఒంటరి నిర్బంధంలో ఉంచుతున్నారని వాపోయారు. మొత్తానికి… జైలులో ఉన్నప్పటికీ ఇమ్రాన్ ఖాన్ స్వరం తగ్గలేదు. “వీధికి రండి” అనే ఆయన పిలుపు పాకిస్తాన్ రాజకీయాల్లో మరోసారి భారీ కలకలం రేపే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది కేవలం ఒక ట్వీట్ కాదు… రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఉద్యమానికి సంకేతమా? అన్న ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.