దేశం మొత్తం ఎలక్షన్ మోడ్‌లోనే! – ఐదు రాష్ట్రాల ఎన్నికలతో బీజేపీ అసలు ఆట మొదలు
మొదటి అడుగు – కేంద్ర కేబినెట్ రీషఫుల్! :
బీజేపీ పెద్ద నిర్ణయాలన్నీ రాబోయే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే తీసుకుంటుందన్నది రాజకీయాల్లో ఓ ఓపెన్ సీక్రెట్. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు మొదటగా జరిగే పని – కేంద్ర మంత్రివర్గ మార్పులు. బెంగాల్‌లో ఎలాగైనా గెలవాలని, అస్సాంలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని, తమిళనాడు –కేరళల్లో పార్టీ ఉనికిని బలపరచాలని బీజేపీ గట్టిగా ప్లాన్ చేస్తోంది. అందుకే ఆయా రాష్ట్రాల సామాజిక సమీకరణలకు తగ్గట్లుగా అక్కడి నేతలకు కేంద్ర కేబినెట్‌లో కీలక పదవులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది కాలంగా పనితీరు ఆశించిన స్థాయిలో లేని మంత్రులను తప్పించి, యువతకు, కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలని ప్రధాని మోదీ భావిస్తున్నారన్న ప్రచారం జోరుగా నడుస్తోంది.
ఫిబ్రవరి బడ్జెట్‌లో వరాల వర్షం! :
ఎన్నికలు అంటే బడ్జెట్ కూడా రాజకీయ ఆయుధమే. ఫిబ్రవరిలో ప్రకటించే కేంద్ర బడ్జెట్‌లో ఈ ఐదు రాష్ట్రాలకు భారీగా తాయిలాలు ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా బీజేపీ ప్రధాన టార్గెట్ అయిన పశ్చిమ బెంగాల్‌పై వరాల వర్షం కురిసే ఛాన్స్ ఎక్కువ. మమతా బెనర్జీ పదిహేనేళ్ల పాలనపై ఏర్పడిన ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని బీజేపీ చూస్తోంది. అస్సాంలో కొనసాగింపుకు, కేరళలో పంచాయతీ ఎన్నికల ఫలితాల ఆధారంగా, తమిళనాడులో హిందూత్వ రాజకీయాల ఊపును ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తోంది. అందుకే బడ్జెట్‌లో అభివృద్ధి ప్యాకేజీలు కీలక పాత్ర పోషించనున్నాయి.
నాలుగు–ఐదు నెలలు ఎన్నికల వేడి! :
ఎప్పుడూ ఎన్నికలే జరగడం ప్రజాస్వామ్యానికి మంచిదా కాదా అనే చర్చ పక్కన పెడితే… రాజకీయాలు మాత్రం ఎప్పుడూ వాడివేడిగానే సాగుతాయి. ఎన్నికల సమయంలో రాజకీయ ఖర్చుల వల్ల ఆయా రాష్ట్రాల్లో ఆర్థిక చలనం పెరుగుతుంది. అప్పటివరకు దాచుకున్న డబ్బు మళ్లీ ప్రజల్లోకి వస్తుంది. రాజకీయ పెట్టుబడులు, హామీలు, తాయిలాలు అన్నీ కలిసి ఓ ప్రత్యేక వాతావరణాన్ని సృష్టిస్తాయి. అందుకే కొందరు ప్రశ్నిస్తారు – వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎందుకు? ఇలా నిరంతరం ఎన్నికల పండుగలే ఉంటేనే కదా రాజకీయాలు బతికేది!