ఏపీ ఎన్నారై ఎమ్మెల్యేల ఇలాకాల్లో ఇవేం లుక‌లుక‌లు... !

RAMAKRISHNA S.S.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నారై నాయకుల ప్రవేశం ఈ ఏడాది ఒక ఆసక్తికరమైన మలుపు తీసుకుంది. 2024 ఎన్నికల్లో గుడివాడ, కళ్యాణదుర్గం, చింత‌ల‌పూడి వంటి కీలక నియోజకవర్గాల్లో ఎన్నారై నేపథ్యం ఉన్న టీడీపీ నేతలు ఘనవిజయం సాధించారు. విదేశాల్లో స్థిరపడి, ఉన్నత విద్యావంతులుగా, సేవా దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చిన వీరిపై ప్రజల్లో భారీ అంచనాలు ఉండేవి. అయితే, 2025 ఏడాది ముగుస్తున్న తరుణంలో వీరి ప్రోగ్రెస్ రిపోర్ట్ మిశ్రమంగా కనిపిస్తోంది.


మొదట్లో పాజిటివ్.. ఇప్పుడు నెగిటివ్.. ?
ఎన్నికల తర్వాత మొదటి ఆరు నెలలు ఈ ఎన్నారై ఎమ్మెల్యేలు అద్భుతమైన పనితీరు కనబరిచారు. అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వ నిధుల కోసం వేచి చూడకుండా, తమ సొంత నిధులను వెచ్చించి ప్రజల మన్ననలు పొందారు. కార్పొరేట్ తరహాలో పాలనను అందిస్తారని ప్రజలు భావించారు. అయితే, గత కొన్ని నెలలుగా పరిస్థితి మారుతోంది. గుడివాడ ( వెనిగండ్ల రాము ) కొన్నాళ్లుగా గుడివాడలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎమ్మెల్యే పనితీరుపై స్థానిక నాయకత్వంలోనే అసంతృప్తి మొదలైందని వార్తలు వస్తున్నాయి. ఆధిపత్య పోరు, కార్యకర్తలతో సమన్వయ లోపం వంటి అంశాలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదుల రూపంలో వెళ్తున్నాయి. అనుకూల మీడియాలో కూడా వ్యతిరేక వార్తలు రావడం ఆయనకు ఇబ్బందికరంగా మారింది.


కళ్యాణదుర్గంఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు విష‌యానికి వ‌స్తే ఇక్కడ కూడా తొలినాళ్లలో ఉన్న జోష్ ప్రస్తుతం కనిపించడం లేదు. స్థానిక నేతలతో విభేదాలు, పరిపాలనలో అనుభవం లేకపోవడం వంటి కారణాల వల్ల ఎమ్మెల్యే గ్రాఫ్ మైనస్‌లోకి వెళ్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. గుంటూరు ఎంపీ, కేంద్ర‌మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పనితీరు మాత్రం ప్రశంసలందుకుంటోంది. కేంద్ర మంత్రిగా ఢిల్లీలో బిజీగా ఉంటూనే, ప్రతి వారం నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. గంటూరు పార్లమెంట్ పరిధిలోని ప్రధాన సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిలా పనిచేస్తున్నారు. అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూనే, రాజకీయ వివాదాలకు దూరంగా ఉండటం ఆయనకు ప్లస్ పాయింట్ అయింది.


చింత‌ల‌పూడి ఎమ్మెల్యే సొంగా రోష‌న్ కుమార్ సైతం త‌న నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌రంగా తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్నారు. కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం చేయ‌లేక‌పోతున్నార‌ని.. అభివృద్ధి అంతంత మాత్ర‌మే అన్న టాకే వినిపిస్తోంది. ఎన్నారై ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు కేవలం నిధులు ఖర్చు చేస్తే సరిపోదని, క్షేత్రస్థాయి రాజకీయాలను, కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. వివాదాల్లో చిక్కుకోవడం, స్థానిక నేతలను దూరం చేసుకోవడం వల్ల భవిష్యత్తులో టికెట్ దక్కించుకోవడం కూడా కష్టతరం కావచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: