మాధురీ మార్క్ ఎఫెక్ట్ – దువ్వాడ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడిందా?
ఇప్పుడు మరోసారి రాజకీయంగా యాక్టివ్‌గా ఉన్నానని చూపించేందుకు దువ్వాడ కొత్త డ్రామాకు తెరలేపారు. టెక్కలికి వెళ్లే నేషనల్ హైవేపై రోడ్డుమీద నిలబడి ఓ వీడియో తీశారు. అందులో సంచలన ఆరోపణలు చేశారు. దివ్వెల మాధురికి తన అనుచరుడు అప్పన్న ఫోన్ చేసి, “ధర్మాన కృష్ణదాస్ మీపై దాడి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు” అని చెప్పాడట. ఆ విషయాన్ని వీడియోలో చెప్పుకుంటూ… “నాకు చావంటే భయం లేదు, దమ్ముంటే దాడికి రండి” అంటూ బహిరంగ సవాల్ విసిరారు. ఈ వీడియో తీసింది కూడా దివ్వెల మాధురీనే అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయ హెచ్చరిక కంటే, ఇది మరో సోషల్ మీడియా కంటెంట్‌లా మారిపోయిందన్న కామెంట్లు వెంటనే మొదలయ్యాయి.
నిజానికి గత ఎన్నికల వరకూ దువ్వాడ శ్రీనివాస్‌ను చాలామంది సీరియస్ రాజకీయ నేతగానే చూశారు. కానీ ఆయన తన వివాహేతర బంధాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తూ రోడ్డెక్కిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అప్పటి నుంచి ఆయన పేరు రాజకీయ చర్చలకంటే ట్రోలింగ్ కంటెంట్‌లోనే ఎక్కువగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో దువ్వాడ అంటేనే మీమ్స్, జోక్స్, రీల్స్ అన్న ఇమేజ్ ఫిక్స్ అయిపోయింది. దివ్వెల మాధురితో కలిసి చేసే వీడియోలు, రీల్స్ ఆయన రాజకీయ ఇమేజ్ను పూర్తిగా మార్చేశాయి.
ఇప్పుడు రాజకీయంగా మాట్లాడినా, ఆరోపణలు చేసినా… ఎవరూ దువ్వాడను సీరియస్‌గా తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. అయినా సరే ఆయన తన ప్రయత్నం తాను చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాల్లో కూడా రాజకీయ వ్యూహం కంటే “దివ్వెల మాధురీ మార్క్ షో”నే ఎక్కువగా కనిపిస్తోందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. పార్టీకి దగ్గరవ్వాలన్న ప్రయత్నమా? లేక సోషల్ మీడియాలో మరోసారి వైరల్ కావాలన్న వ్యూహమా? అన్నది పక్కన పెడితే… దువ్వాడ రాజకీయాలకంటే వినోద రాజకీయాల వైపు పూర్తిగా మళ్లిపోయారన్న అభిప్రాయం మాత్రం బలపడుతోంది.