అసెంబ్లీకి కేసీఆర్ ఎంట్రీ? తెలంగాణ రాజకీయాల్లో హై వోల్టేజ్ హీట్..!

Amruth kumar
ఎట్టకేలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడానికి సిద్ధమవుతున్నారన్న ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. ఈ విషయంలో కేసీఆర్ ఈసారి సీరియస్‌గా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో సమావేశమైన కేసీఆర్, అనంతరం మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దీనికి వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి… “కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అన్ని విషయాలు సభలోనే చర్చిద్దాం” అంటూ సవాల్ విసిరారు. ఆ సవాల్‌కు కేసీఆర్ వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.



ఈ నెల 29 నుంచి తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సాధారణంగా నాలుగు లేదా ఐదు రోజులపాటు మాత్రమే సెషన్ జరుగుతుందని అంచనా. అయితే కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. “కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయన ఎన్ని రోజులు కోరుకుంటే అన్ని రోజులు సభను నడుపుతాం” అని రేవంత్ ప్రకటించారు. తొలి రోజే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం కానుంది. అక్కడే సభ వ్యవధిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై పూర్తి స్థాయి చర్చ కోరుతున్న నేపథ్యంలో, సభ రోజులు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.



ఇరిగేషన్ అంశమే ఈ శీతాకాల సమావేశాలకు హాట్ టాపిక్‌గా మారనుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత చేపట్టిన అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి? వాటిపై ఖర్చు, ఫలితాలు ఏంటి? అన్నదానిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని భావిస్తోంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశాన్ని ప్రధానంగా ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉందని తెలుస్తోంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా సభలో చర్చకు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. పదేళ్ల కేసీఆర్ పాలనలో అక్రమాలు, అవినీతి జరిగాయని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తే, రెండేళ్ల రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. దాంతో సభలో మాటల యుద్ధం పీక్స్‌కు చేరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వింటర్ సెషన్ ఈసారి సాధారణ సమావేశంగా కాకుండా రాజకీయంగా హై వోల్టేజ్ డ్రామాగా మారనుందని అంచనాలు పెరుగుతున్నాయి.



కేసీఆర్ నిజంగా సభకు వచ్చి పూర్తి స్థాయిలో చర్చల్లో పాల్గొంటే, తెలంగాణ అసెంబ్లీ దృశ్యం చూడటానికి రెండు కళ్లూ చాలవని అంటున్నారు. ఒక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరో వైపు ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం కేసీఆర్… ఈ సీన్ వేరే లెవెల్ అని టాక్. ఎందుకంటే పదకొండేళ్ల క్రితం టీడీపీ తరఫున రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఉండగా, సీఎం కుర్చీలో కేసీఆర్ ఉన్నారు. ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఈ రివర్స్ రాజకీయమే ఈసారి అసెంబ్లీ చర్చలను మరింత ఆసక్తికరంగా మార్చనుంది. ఏది ఏమైనా 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ స్టార్ట్ అవుతోంది. కేసీఆర్ వస్తే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు టీవీలకు అతుక్కోవడం ఖాయమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: