300 ఏళ్ల శ్రీవారి లడ్డూ కథ : రుచిలో మార్పు లేని మహా ప్రసాదం..!
చరిత్రకారుల ప్రకారం తిరుమలలో ప్రసాదం తయారీ 1480 నాటికే అమల్లో ఉందని తెలుస్తోంది. ఆ రోజుల్లో శ్రీవారి ప్రసాదాన్ని “మనోహరం” అని పిలిచేవారని పురావస్తు ఆధారాలు చెబుతున్నాయి. 18వ శతాబ్దంలో లడ్డూ ప్రసాదం ప్రారంభమై, అప్పటి నుంచి నేటివరకు రుచిలో ఎలాంటి మార్పు రాకపోవడమే దీని ప్రత్యేకత. అదే వాసన, అదే మాధుర్యం… తరతరాలుగా అదే అనుభూతి. అందుకే శ్రీవారి లడ్డూ కేవలం తీపి పదార్థం కాదు, అది భక్తికి ప్రతీకగా మారింది. స్వామివారి లడ్డూ తినకుండా, ఇంటికి తీసుకురాకుండా భక్తుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదంటారు.
1940 దశకంలో నాటి మద్రాసు ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరుమలలో లడ్డూ తయారీకి మరింత వ్యవస్థబద్ధత తీసుకొచ్చారని చరిత్ర చెబుతోంది. అయితే లడ్డూ తయారీ విధానంలో కాలక్రమేణా కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయట. మొత్తం మీద ఇప్పటివరకు సుమారు ఆరు మార్పులు మాత్రమే జరిగినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా మాత్రం లడ్డూ తయారీ విధానంలో ఎలాంటి మార్పు జరగలేదు. ఆ కారణంగానే నేటికీ లడ్డూ రుచి భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది.
శ్రీవారి లడ్డూను తొలిసారి తయారు చేసిన వ్యక్తిగా కల్యాణం అయ్యంగార్ పేరు చరిత్రలో నిలిచిపోయింది. మద్రాసుకు చెందిన ఆయనకు తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి అంటే అపారమైన భక్తి ఉండేది. దానగుణం, పరోపకారం ఆయన జీవిత లక్షణాలు. స్వామివారికి నైవేద్యంగా పెట్టిన పదార్థాన్నే భక్తులకు ప్రసాదంగా ఇవ్వాలన్న ఆలోచనతోనే లడ్డూ తయారీకి ఆయన నాంది పలికినట్లు పురావస్తు గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.
లడ్డూ తయారీ బాధ్యతను మొదట కల్యాణం అయ్యంగార్ స్వయంగా నిర్వహించి, ఆ తర్వాత తన కుమారుడు, కుటుంబ సభ్యులకు అప్పగించారట. ఈ విధానాన్నే మిరాసీదారీ వ్యవస్థగా పిలుస్తారు. ఈ వ్యవస్థను కూడా కల్యాణం అయ్యంగారే ఏర్పాటు చేసినట్టు చెబుతారు. అయితే కాలక్రమంలో ఈ బాధ్యత టీటీడీ ఉద్యోగుల చేతుల్లోకి వచ్చింది. నేడు శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా తయారయ్యే శ్రీవారి లడ్డూ కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. ధనుర్మాసంలో ఒకసారి అయినా ఈ లడ్డూ చరిత్ర తెలుసుకోవడం భక్తులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు.