జిల్లాల పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్ స్వల్ప మార్పులతో ముందుకెళ్లండి!

Amruth kumar
జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజల అభిప్రాయాలకు పెద్ద పీట వేస్తూ, స్వల్ప మార్పుచేర్పులతో ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. గత నెల 27న రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజనపై ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయగా… దానిపై నెల రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 927 సూచనలు, అభ్యంతరాలు రావడంతో, వాటిపై క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యం ఇస్తూ కీలక మార్పులపై సీఎం స్పష్టత ఇచ్చారు. ముఖ్యంగా గూడూరు నియోజకవర్గ ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని గూడూరు పరిధిలోని ఐదు మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే విలీనం చేయాలని ఆదేశించారు.

 

ఇది స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న నిర్ణయంగా మారింది. అలాగే రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో, రాయచోటిని మదనపల్లి జిల్లాలో, రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను కడప జిల్లాలో కలపాలన్న ప్రతిపాదనలపై చర్చ జరిగినప్పటికీ… దీనిపై తుది నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉంది. విస్తీర్ణపరంగా పెద్దదైన ఆదోని నియోజకవర్గాన్ని రెండు మండలాలుగా విభజించాలన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. మరోవైపు అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి డివిజన్‌ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్‌ను కొత్త డివిజన్‌గా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మునగపాకను అనకాపల్లి డివిజన్‌లో, అచ్యుతాపురాన్ని అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్‌లో చేర్చాలని సీఎం స్పష్టం చేశారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు కానున్న పోలవరం జిల్లాలో మాత్రం ఎలాంటి మార్పులు చేయకుండా ప్రాథమిక నోటిఫికేషన్ ప్రకారమే కొనసాగించాలని ఆదేశించారు.

 

ఇక శ్రీకాకుళం జిల్లాలో నందిగం మండలాన్ని పలాస నుంచి టెక్కలి డివిజన్‌కు, అనకాపల్లి జిల్లాలో చీడికాడను నర్సీపట్నం నుంచి అనకాపల్లి డివిజన్‌కు, కాకినాడ జిల్లాలో సామర్లకోటను పెద్దాపురం డివిజన్‌కు మార్చాలని నిర్ణయించారు. అలాగే అద్దంకి రెవెన్యూ డివిజన్‌లోని ఐదు మండలాలను ప్రకాశం జిల్లాలో విలీనం చేయనున్నారు. కందుకూరు డివిజన్‌లో మిగిలిన వరికుంటపాడు, కొండాపురం మండలాలను కావలి డివిజన్‌లోకి మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు. మొత్తానికి జిల్లాల పునర్విభజనలో రాజకీయ లెక్కలకంటే ప్రజాసౌకర్యమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం ముందుకెళ్తోంది. స్వల్ప మార్పులతో తుది నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధమవుతుండటంతో రాష్ట్ర పరిపాలనలో మరో కీలక అధ్యాయం ప్రారంభం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: