రాజకీయాల్లో ఏదైనా కొత్త పార్టీ పెట్టాలంటే అంత సులభమైన విషయం కాదు. పార్టీ పెట్టాలంటే ప్రజల్లో ఫేమస్ అయినా అయి ఉండాలి.. లేదా ప్రజలకు ఎప్పుడూ దగ్గరగా ఉండి వారి కష్టసుఖాల్లో తోడైన మనిషిగా నైనా అయి ఉండాలి. చాలామంది సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వచ్చి కొత్త పార్టీలు పెడుతూ ఉంటారు. అయితే వీరిలో కొంత మంది సక్సెస్ అయితే మరి కొంత మంది సక్సెస్ కాకపోవడంతో రాజకీయాలు వదిలేసి మళ్లీ సినిమాలే దిక్కని చేసుకుంటూ ఉంటారు.అయితే సినిమా వాళ్లు రాజకీయాల్లో కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. వారు రాజకీయాల్లో సక్సెస్ అవ్వడానికి కారణం సినిమాల్లో వారికి ఉన్న పేరు ప్రఖ్యాతలే.. సినిమాల్లో ఫేమస్ అవడం వల్ల అందరికీ తెలిసిపోవడంతో రాజకీయాల్లోకి కూడా వచ్చి రాజకీయాల్లో కూడా పాపులర్ అవుతూ ఉంటారు. అలా వచ్చిన వారు కొంతమంది రాజకీయాల్లో కొనసాగితే మరి కొంత మంది రాజకీయాలు చేయలేక తప్పుకుంటూ ఉంటారు. అయితే ఈ విషయం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో కొత్త పార్టీ పెట్టడం సాధ్యమేనా అనే విషయం గురించి చూసుకుంటే..
ఆంధ్రప్రదేశ్లో కొత్త పార్టీ పెట్టడం సాధ్యమంటూ ఆ మధ్యకాలంలో సునీల్ కుమార్ చెప్పుకొచ్చారు. కాపు+ ఎస్సీలను కలిపి పెట్టొచ్చు అని చెప్పుకొచ్చారు. అయితే ఈ మధ్యకాలంలో వంగవీటి రంగా కుమార్తె ఆశా ప్రజల్లో తిరుగుతూ కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మొదట్లో వంగవీటి రంగా కుమార్తె ఆశ వైఎస్ఆర్సిపి లో చేరుతుంది అనే ప్రచారం జరిగింది.కానీ ఇప్పుడు అదంతా ఉత్తి ప్రచారమేనని,ఆశ కొత్త పార్టీ పెట్టబోతుందనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయాలను చూస్తే కొత్త పార్టీ పెట్టడం అంత సులువైన పద్ధతి అయితే కాదు. రాజకీయాల్లో సొంతంగా పార్టీ పెట్టి ఎదగాలంటే పెట్టి పుట్టాలి అదృష్టం ఉండాలి అనే లెవెల్ కి మారిపోయింది. గతంలో అంటే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సమైక్యాంధ్ర పార్టీ అని పెట్టి పూర్తిగా మునిగిపోయాడు. గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి కొద్ది రోజులు పార్టీని ముందుకు నడిపించి ఆ తర్వాత రాజకీయాలు తన వల్ల కాదని, రాజకీయాలకు గుడ్ బై చెప్పి మళ్ళీ సినిమాల వైపు వచ్చేసారు.
ఇక పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ దాదాపు 9 సంవత్సరాలు ఇబ్బందులు పడి చివరికి గత్యంతరం లేక టిడిపి పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావలసిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టులు ఎప్పటినుండో ఉన్నప్పటికీ వారిలో అంత స్థిరత్వం లేదు. ఇక వీరందరిలో మధ్యలో వచ్చి సక్సెస్ అయిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఈయన తండ్రి మరణించాక కాంగ్రెస్ పార్టీతో విభేదించి వైఎస్ఆర్సిపి అనే పార్టీని స్థాపించి సక్సెస్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టాక కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారందరినీ తన పార్టీలోకి లాక్కున్నారు. ప్రస్తుతం ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకే దిక్కు లేకుండా అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకి పోటీగా జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సిపి పార్టీని ప్రజలు యాక్సెప్ట్ చేశారు. కానీ మిగతా వాళ్లను యాక్సెప్ట్ చేయలేదు. అలాంటి జగన్ కూడా ఇప్పుడు ఆంధ్రాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కొత్త పార్టీ సాధ్యమా అంటే సాధ్యం కాదు అనే భావనే వినిపిస్తోంది.