చంద్ర‌బాబు మార్క్ విజ‌న్‌.. ఏపీలో రెండు గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లు..!

RAMAKRISHNA S.S.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన 'విజన్'. ఏదైనా ఒక ప్రాజెక్టును తలపెట్టారంటే, ఎన్ని అడ్డంకులు ఎదురైనా దానిని పూర్తి చేసే వరకు విశ్రమించని తత్వం ఆయనది. ఉమ్మడి రాష్ట్రంలో శంషాబాద్ విమానాశ్రయం నుండి నేటి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు ఆయన చేసిన కృషి, మౌలిక సదుపాయాల కల్పనలో ఆయనకున్న దూరదృష్టికి నిదర్శనం అనే చెప్పాలి.


శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ - ఒక దశాబ్దం ముందే ఆలోచన
హైదరాబాద్‌ను గ్లోబల్ మ్యాప్‌లో నిలబెట్టిన ఘనత శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌దే. అప్పట్లో నగరం వెలుపల ఐదు వేల ఎకరాల్లో ఇంత పెద్ద ఎయిర్‌పోర్ట్ అవసరమా అని విమర్శలు వచ్చాయి. కానీ, భవిష్యత్తులో విమాన ప్రయాణికుల రద్దీ పెరుగుతుందని ముందే ఊహించిన బాబు, కేంద్రం నుండి అనుమతులు సాధించి, భూసేకరణ పూర్తి చేశారు. నేడు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రపంచంలోని అత్యుత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచింది. ఆయన ప్లాన్ చేసిన ఐదు వేల ఎకరాల విస్తీర్ణం కారణంగానే, నేటికీ హైదరాబాద్‌కు మరో ఎయిర్‌పోర్ట్ అవసరం లేకుండా పోయింది.


భోగాపురం ఎయిర్‌పోర్ట్ - ఏపీ నవయుగానికి నాంది :
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రకు ఒక అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం ఉండాలని చంద్రబాబు సంకల్పించారు. 2016లోనే భోగాపురం విమానాశ్రయానికి ప్రణాళికలు సిద్ధం చేసి, అనుమతులు తీసుకొచ్చారు. 2019లో పనులు ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో పనుల్లో జాప్యం జరిగింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏడాదిన్నర కాలంలోనే పనులను పరుగులు పెట్టించి, రికార్డు సమయంలో నిర్మాణం పూర్తి చేయించారు.


ఈ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోనున్నాయి. పారిశ్రామికంగా, పర్యాటక రంగంలో భోగాపురం ఒక కీలక మలుపు కానుంది. చంద్రబాబు నాయుడు దేశంలోనే ఇద్దరు గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులకు రూపకల్పన చేసి, పూర్తి చేయించిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. విమర్శలను పట్టించుకోకుండా, భావి తరాల ప్రయోజనాలే పరమావధిగా ఆయన చేసే పనులు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్ట్ త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుండటంతో ఉత్తరాంధ్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: