వైసీపీలో హాట్ టాపిక్‌గా దేవినేని అవినాష్‌...?

RAMAKRISHNA S.S.
విజయవాడ రాజకీయాల్లో దేవినేని నెహ్రూ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన దేవినేని అవినాష్, తన రాజకీయ ఉనికిని చాటుకోవడానికి గత పదేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. యువకుడిగా, ఉత్సాహవంతుడిగా పేరున్నప్పటికీ, ఎన్నికల ఫలితాలు మాత్రం ఆయనకు ఆశించిన విజయాన్ని అందించడం లేదు. ఇప్పుడు 2026 నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ, అవినాష్ రాజకీయ భవిష్యత్తు మరియు ఆయన కోరుకుంటున్న పెనమలూరు నియోజకవర్గంపై వైసీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.


దేవినేని అవినాష్ ఇప్పటివరకు మూడు సార్లు మూడు వేర్వేరు పార్టీలు/నియోజకవర్గాల నుండి పోటీ చేసినా గెలుపు ముంగిట ఆగిపోయారు. 2014 లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాల‌య్యారు. 2019లో తెలుగుదేశం పార్టీ తరఫున గుడివాడ నుండి కొడాలి నానిపై పోటీ చేసి ఓడిపోయారు. 2024లోవైసీపీ తరఫున విజయవాడ తూర్పు నుండి పోటీ చేసి గద్దె రామ్మోహన్ చేతిలో ఓటమి చెందారు. మూడు ఎన్నిక‌ల్లోనూ వరుసగా పోటీ చేయడమే తప్ప అసెంబ్లీలో అడుగుపెట్టలేకపోవడం అవినాష్‌ను తీవ్రంగా కలచివేస్తోంది. అందుకే 2029 ఎన్నికల నాటికైనా 'సేఫ్ సీటు' వెతుక్కోవాలనేది ఆయన ఆలోచన.


పెనమలూరుపై కన్నేసిన అవినాష్ ..?
ప్రస్తుతం విజయవాడ తూర్పు ఇంచార్జ్‌గా ఉన్నప్పటికీ, అవినాష్ దృష్టి అంతా పెనమలూరు నియోజకవర్గంపైనే ఉంది. దీనికి ప్రధాన కారణాలు చూస్తే పెనమలూరులో కమ్మ సామాజిక వర్గం ఓట్లు అత్యంత కీలకం. గతంలో తన తండ్రి దేవినేని నెహ్రూకు ఇక్కడ (పాత కంకిపాడు పరిధిలో) బలమైన కేడర్ మరియు అనుచరవర్గం ఉండేది. గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసిన జోగి రమేష్ ఓటమి తర్వాత, ఆయన తిరిగి తన సొంత నియోజకవర్గమైన మైలవరంకు వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం పెనమలూరు వైసీపీ ఇంచార్జ్ కొర‌త ఉంది. చ‌క్ర‌వ‌ర్తి ఉన్నా ఆయ‌న‌కు సీటు ఇస్తార‌న్న గ్యారెంటీ లేదు.


అధిష్టానం వ్యూహం - ఎంపీ సీటుపై ఒత్తిడి.. ?
అవినాష్ పెనమలూరు అసెంబ్లీ స్థానం కోరుతుంటే, వైసీపీ అధిష్టానం ఆలోచన మరోలా ఉన్నట్లు సమాచారం. విజయవాడ పార్లమెంట్ పరిధిలో దేవినేని కుటుంబానికి ఉన్న పేరును వాడుకుని, ఆయనను ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే, తాను ఎంపీగా పోటీ చేసే ప్రసక్తే లేదని, అసెంబ్లీకే వెళ్తానని అవినాష్ పట్టుబడుతున్నారు. ఈ విషయంలో అధిష్టానానికి, అవినాష్‌కు మధ్య ఒకరకమైన 'కోల్డ్ వార్' నడుస్తోందని పార్టీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.


2026లో అయినా జగన్ కరుణించి అవినాష్‌ను పెనమలూరు ఇంచార్జ్‌గా ప్రకటిస్తారా? లేక విజయవాడ తూర్పులోనే కొనసాగమని చెబుతారా? అనేది చూడాలి. దేవినేని నెహ్రూ వారసుడిగా తనను తాను నిరూపించుకోవాలంటే ఈ కొత్త ఏడాదిలో అవినాష్ తన రాజకీయ వ్యూహాలను మరింత పదును పెట్టాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: