క‌డ‌ప రెడ్డెమ్మ‌పై వైసీపీకి ఇంత కోపం ఎందుకు..?

RAMAKRISHNA S.S.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా భావించే కడపలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి (కడప రెడ్డెమ్మ) దూకుడు ఇప్పుడు ఆ పార్టీకి మింగుడుపడటం లేదు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న పనులు భవిష్యత్తులో తమ ఉనికిని దెబ్బతీస్తాయన్న భయంతో వైసీపీ నేతలు ఆమెపై వ్యతిరేక ప్రచారానికి దిగుతున్నారని స్థానికంగా రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.


అంబులెన్స్ వివాదం - నిజాలు నిగ్గుతేల్చిన ఎమ్మెల్యే
ఇటీవల కడపలో కొన్ని అంబులెన్స్‌లు మూలనపడి ఉన్నాయంటూ వైసీపీ అనుకూల మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఘాటుగా స్పందించారు. మూలనపడిన ఆ అంబులెన్స్‌లు వైసీపీ హయాం నాటివని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆరు కొత్త అంబులెన్స్‌లు కడపకు వచ్చాయని ఆమె నిరూపించారు. స్వయంగా మీడియాను తీసుకువెళ్లి కొత్త అంబులెన్స్‌లు నడుస్తున్న తీరును, పాతవి ఎందుకు మూలనపడ్డాయో ప్రజలకు వివరించారు.


సీసీ కెమెరాల ఏర్పాటు - వసూళ్ల ఆరోపణలు :
కడప నగరంలో అరాచకాలను అరికట్టేందుకు నగరం అంతటా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే నిర్ణయించారు. ప్రస్తుతం కడప కార్పొరేషన్ వైసీపీ చేతుల్లో ఉండటంతో, సీసీ కెమెరాలు పెడితే తమ అక్రమాలు బయటపడతాయని వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ నిధులకు అడ్డంకులు ఎదురవడంతో, ఎమ్మెల్యే స్వయంగా నగరంలోని వివిధ వర్గాల నుంచి విరాళాలు సేకరించి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని భావిస్తున్నారు. అయితే, దీనిని వైసీపీ నేతలు 'వసూళ్లు'గా అభివర్ణిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. కడపలో దశాబ్దాలుగా ఉన్న సమస్యలకు మాధవీరెడ్డి పరిష్కారం చూపుతుండటం వైసీపీ నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. రోడ్లు, డ్రైనేజీ మరియు మౌలిక సదుపాయాల కల్పనలో ఆమె చూపుతున్న శ్రద్ధ ప్రజలను ఆకట్టుకుంటోంది.


మాధ‌వీ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయకపోతే కడపలో వైసీపీ పట్టు పూర్తిగా పోతుందని భావించిన నేతలు, ప్రతి చిన్న విషయాన్ని వివాదం చేస్తూ ఆమెపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని సమాచారం. వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, మాధవీరెడ్డి మాత్రం తనదైన శైలిలో అభివృద్ధిని కొనసాగిస్తున్నారు. కడప ప్రజల్లో ఆమెకు పెరుగుతున్న ఆదరణ చూస్తుంటే, రాబోయే రోజుల్లో అక్కడ వైసీపీకి రాజకీయంగా కష్టకాలమేనని స్పష్టమవుతోంది. తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతూ ఆమె చేస్తున్న పోరాటం కడప రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: